Aug 08,2022 09:37

ప్రజాశక్తి - నందిగామ (ఎన్‌టిఆర్‌) : నందిగామ మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో పనిచేస్తున్న వాటర్‌ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ... సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నందిగామ మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ వాటర్‌ వర్క్స్‌ విభాగం వద్ద కార్మికులు నిరసన తెలిపారు. నందిగామ మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో పనిచేసే కార్మికులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు నందిగామ మండల కార్యదర్శి కె.గోపాల్‌ మాట్లాడుతూ ... ఇంజినీరింగ్‌కి భాగంలో పనిచేసే కార్మికులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, ప్రభుత్వం నుండి ఏ పథకం వచ్చినా అప్లై చేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగి అని పథకాలు అమలు కావట్లేదని, ప్రభుత్వం కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులుగా అయినా గుర్తించాలని లేదా సంక్షేమ పథకాలయినా వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇంజినీరింగ్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 11వ తేదీన రాష్ట్ర సదస్సు నిర్వహిస్తామన్నారు. ఆ సదస్సులో ఇంజనీరింగ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించలేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్‌ వర్కర్స్‌ విభాగం యూనియన్‌ నాయకులు శ్రీను, పరిమి రవి, దాసు, బ్రహ్మం కార్మికులు పాల్గొన్నారు.