Oct 29,2022 20:23
  • పోలవరం నిర్వాసితుల ధర్నా

ప్రజాశక్తి - కుకునూరు (ఏలూరు జిల్లా) : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల సర్వం కోల్పోతున్న తమకు పరిహారం ఇవ్వకుండా, పునరావాసం కల్పించకుండా పాలకులు నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ నిర్వాసితులు ఏలూరు జిల్లా కుకునూరు తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. సిపిఎం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇటీవల వచ్చిన గోదావరి వరదలు మండలాన్ని ముంచెత్తి తీవ్రనష్టాన్ని మిగిల్చాయని తెలిపారు. ఏళ్లు గడుస్తున్నా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం మాత్రం రావడంలేదన్నారు. వరదల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదని తెలిపారు. ఓ వైపు వ్యవసాయంలేక రైతులు, పనుల్లేక కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 41.15 కాంటూర్‌లో మొదటివిడత ఎనిమిది గ్రామాలకు పరిహారం వస్తుందనుకుంటుంటే అధికారులు మళ్లీ సర్వే అంటూ పేర్లున్న జాబితాతో గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ నిర్వాసితులను అయోమయానికి గురిచేస్తున్నారని అన్నారు. నిర్వాసితుల త్యాగాల ఫలితంగా పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నామని, వారు త్యాగధనులని ప్రభుత్వాలు కీర్తిస్తుండగా, ఇటీవల చేపట్టిన సర్వే జాబితాల్లో తమపేర్లు లేవని, తమ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని కోరిన నిర్వాసితులపట్ల అధికారులు అవమానకరంగా ప్రవర్తిచండం సరికాదని పేర్కొన్నారు. కుకునూరు 'ఎ' బ్లాక్‌లోని 119 పేర్లు, కివ్వాకలో 102 ఇంటి పరిహారపు జాబితాలో గల్లంతైన పేర్లు జాబితాలోకి చేర్చి సర్వే చేయాలని, మాధవరం, కౌండిన్యముక్తి, ఎల్లప్పగూడెం, బెస్తగూడెం గ్రామాలను మొదటి పరిహారపు జాబితాలోకి చేర్చి పరిహారం చెల్లించాలని, వరద బాధితులకు తక్షణం ఇంటి నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహశీల్దార్‌ భద్రయ్యకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి యర్రంశెట్టి నాగేంద్రరావు, నాయకులు మహబూబ్‌ పాషా, వలీ పాషా, లక్ష్మీ, దానూరి శ్రావణి పాల్గొన్నారు.