జీవన సంధ్యా సమయంలో
వృద్ధాప్యం అంతులేని ఘర్షణలకు
ఆవేదనలకు నిలయం
వృద్ధాప్యం శాపం కాదు
అది అనుభవాల ఆస్తి నైపుణ్యాల నిధి
పెద్దరికం నవతరంతో
నగుబాట్లకు గురౌతున్నది
కోటి ఆశలతో ఆకాంక్షలతో కనిపెంచిన
తల్లితండ్రులకు జీవిత మలిదశలో
కష్టాలే కానుకలైనాయి
అవమానాలే అభినందనలైనాయి
ఈసడింపులే పలకరింపులైనాయి
సూటి పోటి మాటలే
వారి పాలిట ఆత్మీయ స్పర్శ అయ్యింది
నిరంతరం శ్రమించిన
త్యాగమూర్తులకు గుక్కెడు
గంజి మెతుకులు కరువైనాయి
ఆత్మీయత కరువై
ఒంటరి తనం ఆస్తి అయ్యింది
నిరాశే తోడు నీడైంది
జవసత్వాలు ఉడిగి వృద్ధాప్యపు బోటుకు
నిరాకరణ నిరాదరణ అనే
చిల్లులు పడ్డాయి
కరుణ కరువై కాఠిన్యం బరువై
కష్టాలే శరణ్యమై అనారోగ్యమే సంపదై
కలలన్నీ కన్నీరై ఆశలన్నీ ఆవిరై
జీవితం మలిదశలో ఆపన్న హస్తం కోసం
ఎదురుచూస్తున్న వృద్ధులను ఆదరిద్దాం
వృద్ధులు వద్దు ఆస్తులే ముద్దు అనే
వైఖరి విడనాడాలి
మానవీయ విలువలతో
సంస్కారంతో ''పెద్దరికానికి''
''పెద్ద పీట'' వేయాలి
వృద్ధులను కంటికి
రెప్పలా కాపాడుకోవాలి.
- నేదునూరి కనకయ్య,
సెల్ : 9440245771










