Oct 23,2023 11:29
  • కాలుష్య నిరోధక ప్రణాళిక రెండో దశ ప్రారంభం

న్యూఢిల్లీ : ఢిల్లీ- దేశరాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్‌)లో వాయు నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ కాలుష్య నివారణ ప్రణాళిక స్టేజ్‌ 2ను అమల్లోకి తీసుకురానుంది. తాజాగా ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో వాయు కాలుష్య పరిస్థితిపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాలుష్య నివారణ ప్రణాళిక స్టేజ్‌ 2 అమలుపై చర్చ జరిగింది. శనివారం నాటికి ఢిల్లీలో 24 గంటల సగటు వాయు నాణ్యత సూచిక (ఎక్యూఐ) 248 పాయింట్లుగా ఉంది. ఈ నెల 23, 24 తేదీల్లో ఢిల్లీ, ఎన్‌సిఆర్‌లో వాయు కాలుష్యం మరింత దిగజారుతుందనే అంచనాలు వెలువడ్డాయి. అందువల్ల కాలుష్య నివారణ ప్రణాళిక స్టేజ్‌ 1 చర్యలతో పాటు స్టేజ్‌ 2 చర్యలు కూడా తీసుకోవాలని సమావేశం నిర్ణయం తీసుకుంది. కాలుష్య నివారణ ప్రణాళికలను మొత్తంగా నాలుగు స్టేజ్‌లుగా వర్గీకరించారు. స్టేజ్‌ 1 - పూర్‌ (ఎక్యూఐ 201 నుంచి 300), స్టేజ్‌ 2 -వెరీ పూర్‌ (ఎక్యూఐ 301 నుంచి 400), స్టేజ్‌ 3 -తీవ్రం (ఎక్యూఐ 401 నుంచి 450), స్టేజ్‌ 4- సివియర్‌ ప్లస్‌ (ఎక్యూఐ 450 కంటే ఎక్కువ)గా విభజించారు. స్టేజ్‌ 1లో భాగంగా గాలిలో దూళిని తగ్గించడానికి మార్గదర్శకాలు సక్రమంగా అమలు చేయడం, అక్రమ నిర్మాణాల కూల్చివేత, హోటళ్లు, రెస్టారెంట్లు వద్ద బొగ్గు, కట్టెల వాడకంపై నిషేధాన్ని అమలు చేస్తారు. స్టేజ్‌ 2లో ప్రైవేట్‌ వాహనాలకు పార్కింగ్‌ ఫీజులు పెంచడం, సిఎన్‌జి లేదా ఎలక్ట్రిక్‌ బస్సులు, మెట్రో సేవలను పెంచడం, వీటి సర్వీసులు పెంచడానికి అదనపు ఫ్లీట్‌లను ప్రవేశపెట్టడం వంటి చర్యలు చేపడతారు.స్టేజ్‌ 3లో పెట్రోల్‌, డీజిల్‌ ఇంజన్లతో నడిచే నాలుగు, అంతకంటే ఎక్కువ చక్రాలు ఉన్న వాహనాలను నిషేధిస్తారు. అనవసరమైన నిర్మాణం, కూల్చివేత పనులనూ నిలిపివేస్తారు.స్టేజ్‌ 4లో అన్ని రకాల నిర్మాణ, కూల్చివేత పనులనూ నిషేధిస్తారు.విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల కోసం వర్క్‌ ఫ్రం హోం వంటి చర్యలు అమలు చేస్తారు.