Nov 01,2023 10:25

న్యూఢిల్లీ : 81.5 కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత వివరాలను ఇటీవల డార్క్‌ వెబ్‌ ఫోరంలో అమ్మకానికి ఉంచినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. భారత్‌లోని కొని మీడియా సంస్థల కథనాల ప్రకారం.. కోట్లాది మంది భారతీయుల వివరాలు ఉన్న లింక్‌ను అమెరికాకు చెందిన సైబర్‌ సెక్యూరిటీ సంస్థ రెసెక్యూరిటీ వెల్లంచింది. అక్టోబర్‌ ప్రారంభంలోనే వివరాలు అమ్మకానికి ఉంచినట్లు తెలిపింది. అమ్మకానికి ఉంచిన వ్యక్తిగత వివరాల్లో ఆధార్‌ సంఖ్య, పాస్‌పోర్ట్‌, పేర్లు, ఫోన్‌ నంబర్లు, తాత్కాలిక, శాశ్వత చిరునామాలు.. వంటి వివరాలు ఉన్నాయి. పిడబ్ల్యూఎన్‌ 0001 అనే పేరుతో హ్యాకర్‌ ఈ వివరాలను అమ్మకానికి ఉంచాడు.
           రెసెక్యూరిటీకి చెందిన విచారణ విభాగం హంటర్‌ విక్రేతను సంప్రదించగా.. మొత్తం డేటా సెట్‌ను 80 వేల డాలర్లకు విక్రయిస్తానని తెలిపాడు. ఈ వివరాలను హ్యాకర్‌ ఎలా పొందాడో అనే విషయాన్ని రెసెక్యూరిటీ వెల్లడించలేదు. దేశంలో అత్యున్నత వైద్య సంస్థ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసిఎంఆర్‌) నుంచి హ్యాకర్‌ ఈ డేటాబేస్‌ను చోరీ చేసి ఉంటాడని ఊహాగానాలు వెల్లడవుతున్నాయి. కోట్లాది మంది భారతీయులు వ్యక్తిగత వివరాలు ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచడంపై ఉన్నతస్థాయి అధికారులు అప్రమత్తమయ్యారని మీడియా నివేదికలు తెలిపాయి. సిబిఐ దీనిపై దర్యాప్తు ప్రారంభించే అవకాశముందని పేర్కొన్నాయి. మీడియాలో వస్తున్న కథనాలను నిర్ధారించడానికి లేదా తిరస్కరించడానికి ఐసిఎంఆర్‌, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిరాకరించాయి. ఐసిఎంఆర్‌ను సైబర్‌ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాదిలోనే ఐసిఎంఆర్‌ సర్వర్‌లోకి వెళ్లడానికి హ్యాకర్లు ఆరు వేల సార్లు ప్రయత్నించారు. దీంతో డేటా లీక్‌లను నివారించడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఐసిఎంఆర్‌ను దర్యాప్తు సంస్థలు కోరాయి.