ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరగకపోతే చర్యలు: కలెక్టర్ ప్రశాంతి

ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమగోదావరి) : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే డెలివరీ కేసులు జరగాలని సుఖ ప్రసవాలు జరిపి లక్ష్యసాధనకు వైద్యాధికారులు కృషి చేయాలని కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిని పూర్తిగా పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్య కేంద్రాల్లో ప్రతినెల 20 ప్రసవాలు జరగాలని ఈ నెలలో ఎందుకు తక్కువ జరిగాయని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు ఆరోగ్య కేంద్రం ద్వారా అన్ని రకాల సేవలు అందించాలన్నారు. ప్రసవాల సంఖ్య పెరగకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సిబ్బంది పూర్తిగా ఉన్న ఎందుకు టార్గెట్ పూర్తి చేయలేకపోతున్నారని వైద్యాధికారులను ప్రశ్నించారు. ఈ నెలలో టార్గెట్ అధిగమించి తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రహదారి పక్కన ఉన్న పీహెచ్సీకి ఓపీలు ఎంత మంది వస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న రోగులతో మాట్లాడారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి నిధులు కొరత లేదని.. కేంద్రంలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. వైద్యులు ప్రజలతో సన్నిహితంగా మెలగాలన్నారు. గ్రామాల్లో గర్భిణీ మహిళలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే పురుడు పోసుకునే విధంగా స్థానిక అధికారులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో డి మహేశ్వరరావు, తహశీల్దార్ పి లక్ష్మి, వివో పి ఆర్ డి టీవీ సత్యనారాయణ, ఆరోగ్య కేంద్రం డాక్టర్ పి.సంతోషనాయుడు, సిఎచ్చ్ ఒజాలాదివిల్సన్ బాబు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.