Nov 21,2023 10:04

క్రీడలను, రాజకీయాలతో ముడిపెట్టకూడదు. విజయాన్ని ఏవిధంగా ఆస్వాదిస్తామో.. ఓటమిని కూడా అదేరీతి(స్పోర్టివ్‌)గా తీసుకోవాలి... అంతేగాని గెలిచినప్పుడు సంబరాలు చేసుకొని.. ఓడినప్పుడు ఆటగాళ్లపై దుమ్మెత్తి పోస్తే ఏం ప్రయోజనం... ఎందుకంటే టీవీ, ప్రసార మాధ్యమం, సోషల్‌ మీడియాలలో ఫైనల్లో టీమిండియా సునాయాసంగా గెలుస్తుందని ప్రచారాల హోరు మొదలైంది. ఎందుకంటే వరుసగా 10మ్యాచుల్లో నెగ్గిన టీమిండియా టైటిల్‌ను కొట్టడం ఖాయమని కోట్లాది రూపాయల బెట్టింగ్‌లు కట్టిన వారూ ఉన్నారు. కానీ ఫైనల్లో టీమిండియా ఓటమి ఎందరో అభిమానుల గుండెలను కలచివేసింది. ఫైనల్లో టీమిండియా ఓటమితో కోట్లాది రూపాయలు పోగొట్టుకొని తీవ్ర భావోద్వేగానికి గురై గుండె ఆగి చనిపోయారు. మరోవైపు క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టడం ఈమధ్యకాలంలో మరీ ఎక్కువైంది. ఈ విష సంస్కృతి సరైంది కాదు. శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌లపై గెలిస్తే ఒకలా... ఒక్క పాకిస్తాన్‌ జట్టుపై గెలిస్తే మరోలా సంబరాలు చేసుకోవడం సరికాదు. పాకిస్తాన్‌పై గెలిస్తే.. ఏకంగా యుద్ధంలో ఆ దేశంపై విజయం సాధించామనే స్థాయిలో సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ధోరణి మారాలి. వీటన్నిటిపై ప్రభుత్వ అజమాయిషీ తప్పనిసరి. క్రీడల్లో ఇతర దేశాల పట్ల సుహృద్భావ, స్నేహపూర్వక ధోరణి ఉండేలా చూడాలి. ఐసిసి వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో టీమిండియా ఓటమి అందరిలో ఓ కనువిప్పు కావాలని కోరుకుందాం..
 

                                                                 బ్యాడ్‌లక్‌ అంపైర్‌గా కెటిల్‌బరో...

భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఫైనల్‌కు ఫీల్డ్‌ అంపైర్‌గా ఉన్న రిచర్డ్‌ కెటిల్‌బరో.. టీమిండియాకు బ్యాడ్‌ లక్‌ అంపైర్‌గా ఉన్నాడు. ఫైనల్లో అతను బ్యాడ్‌లక్‌ అంపైర్‌గా ఉండటమే కాదు.. టీమిండియాకు నష్టం చేసేలా ఒక నిర్ణయం కూడా తీసుకున్నాడు. జస్ప్రీత్‌ బుమ్రా వేసిన ఇన్నింగ్స్‌ 28వ ఓవర్‌ ఐదో బంతిని లబుషేన్‌ ఫ్లిక్‌ ఆడబోయాడు. కానీ, బాల్‌ ప్యాడ్లకు తాకింది. బుమ్రా ఎంతో కాన్ఫిడెంట్‌గా అప్పీల్‌ చేసినా.. కెటిల్‌బరో దాన్ని నాటౌట్‌గా ప్రకటించాడు. అయినా కూడా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బుమ్రాతో ఏకీభవించి రివ్యూ తీసుకున్నాడు. అందులో అంతా బాగానే ఉన్నా.. బాల్‌ లెగ్‌ స్టంప్స్‌కు తాకుతుండటంతో అంపైర్స్‌ కాల్‌ కింద థర్డ్‌ అంపైర్‌ సైతం దాన్ని నాటౌట్‌గా ప్రకటించాల్సి వచ్చింది. ఒక వేళ అంపైర్‌ కెటిల్‌బరో అవుట్‌ ఇచ్చి ఉంటే.. టీమిండియాకు నాలుగో వికెట్‌ దక్కి ఉండేది. ఆస్ట్రేలియా మరింత ఒత్తిడిలోకి వెళ్లి ఫలితం వేరేలా ఉండేది. కానీ, ఇండియాకు బ్యాడ్‌ లక్‌ అంపైర్‌గా పేరుగాంచిన కెటిల్‌బరో ఆదివారం కూడా తన నిర్ణయంతో దాన్ని మరోసారి నిరూపించాడు. ఇప్పుడనే కాదు.. 2014 టి20 వరల్డ్‌ కప్‌, 2015 వన్డే వరల్డ్‌ కప్‌ సెమీఫైనల్‌, 2016 టి20 వరల్డ్‌ కప్‌, 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్‌ కప్‌.. మళ్లీ ఇప్పుడు ఈ వరల్డ్‌ కప్‌ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో కెటిల్‌బరో అంపైర్‌గా ఉండటం టీమిండియాకు అస్సలు కలిసి రాలేదు.
                                                                                                                - ప్రజాశక్తి స్పోర్ట్స్‌ డెస్క్‌