Apr 05,2023 22:01

న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థలో కీలక వాటా కలిగిన సర్వీసు సెక్టారు కొంత డీలా పడింది. గడిచిన ఫిబ్రవరిలో ఈ రంగం 59.4కు చేరి 12 ఏళ్ల గరిష్ట స్థాయిని తాకగా.. మార్చిలో 57.8కి పడిపోయిందని క్రెడిట్‌ రేటింగ్‌ ఎజెన్సీ ఎస్‌అండ్‌పి గ్లోబల్‌ తెలిపింది. ఈ సంస్థ సర్వే ప్రకారం.. ఆగస్టు 2021 నుండి వరుసగా 20వ నెలలుగా ఈ రంగం విస్తరణ జోన్‌లో ఉంది. సర్వేలో 50 కంటే ఎక్కువ ఉంటే సేవల కార్యకలాపాల విస్తరణను సూచిస్తుంది. దాని కంటే తక్కువగా ఉంటే ప్రతికూలతను సూచిస్తుంది. అనుకూలమైన డిమాండ్‌, కొత్త వ్యాపార లాభాల కారణంగా మార్చిలో ఉత్పత్తి పర్వాలేదని పేర్కొంది. సర్వీసు సెక్టార్‌ పదో నెల వరుసగా పెరిగినప్పటికీ.. మార్చిలో సర్వీసుల ఉపాధి స్వల్పంగా మాత్రమే పెరిగిందని ఎస్‌అండ్‌పి తెలిపింది.