Feb 01,2023 10:01
  • కేంద్రం అప్పు రూ.134.08 లక్షల కోట్లు
  • ఆరేళ్లలోనే రూ.68.81 లక్షల కోట్ల పెరుగుదల
  • ప్రభుత్వ రంగ సంస్థల్లో రూ.4 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ
  • ఆర్థిక సర్వే వెల్లడి

ప్రజాశక్తి-న్యూఢిల్లో బ్యూరో : కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్పు రూ.134.08 లక్షల కోట్లకు పెరిగిందని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. మంగళవారం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు. గత ఆరేళ్లలోనే కేంద్రం రూ.68.81 లక్షల కోట్లు అప్పు చేసినట్లు పేర్కొంది. 15వ ఆర్థిక సిఫార్సుల్లో భాగంగా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం సక్రమంగా విడుదల చేయటం లేదు. దాదాపు రూ.30,878 కోట్లు ఇంకా విడుదల చేయకుండా కేంద్ర పెండింగ్‌లో ఉంచింది.
 

                                                             రూ.4 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ

గత తొమ్మిదేళ్లలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణతో రూ.4.07 లక్షల కోట్లు సమకూరినట్లు కేంద్ర ఆర్థిక సర్వే తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.65 వేల కోట్లను లక్ష్యంగా నిర్దేశించుకోగా, 48 శాతం లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకుందని, రూ.31 వేల కోట్లు ఖజానాకు చేరినట్లు పేర్కొంది. ఐడిబిఐతో పాటు షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఎన్‌ఎండిసి స్టీల్‌ లిమిటెడ్‌, బిఈఎంఎల్‌, హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్కర్‌, కంటెయినర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ వంటి సంస్థలను విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఈ ప్రక్రియ వివిధ దశల్లో ఉందని తెలిపింది.
 

                                                   ఎంఎస్‌ఎంఇలను ఆదుకున్న అత్యవసర రుణ హామీ

కరోనా కారణంగా బాగా దెబ్బతిన్న సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్‌ఎంఇ) కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యవసర రుణ హామీ పథకం (ఇఎల్‌సిజిఎస్‌) ఆదుకుందని ఆర్థిక సర్వే తెలిపింది. ఎంఎస్‌ఎంఇలకు 2022 జనవరి-నవంబర్‌ మధ్య సగటున 30.6 శాతం అధికంగా రుణాలు మంజూరు చేసినట్లు ఆర్థిక సర్వే తెలిపింది.
 

                                                                    వృద్ధి రేటు తగ్గే అవకాశం

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం వల్ల మన దేశ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని 2022-23 ఆర్థిక సర్వే నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ 6 శాతం నుంచి 6.8 శాతం వరకు వృద్ధి చెందే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు 7 శాతం ఉంటుందని అంచనా. ఈ సంవత్సరం కన్నా వచ్చే ఏడాది తక్కువ వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మన దేశ స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) నామినల్‌ టెర్మ్స్‌లో 11 శాతం ఉంటుందని సర్వే అంచనా వేసింది.
 

                                                      రూపాయి మరింత ఒత్తిళ్లకు గురవుతుంది

కరెంట్‌ అకౌంట్‌ లోటు మరింత విస్తరిస్తే, ఇండియన్‌ కరెన్సీ రూపాయి ఒత్తిళ్లకు గురవుతుందని తెలిపింది. కరెంట్‌ అకౌంట్‌ డెఫిసిట్‌కు ఫైనాన్స్‌ చేయడానికి తగిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నట్లు ధీమా వ్యక్తం చేసింది.
 

                                                స్వయం సహాయక బృందాల మహిళలపై ప్రశంసలు

కోవిడ్‌ మహమ్మారి సమయంలో ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో స్వయం సహాయక సంఘాల మహిళలు పోషించిన పాత్రను ఈ నివేదిక ప్రత్యేకంగా వివరించింది. దేశంలో 12.6 శాతం మంది విద్యార్థుల డ్రాపౌట్స్‌ అయినట్లు ఆర్థిక సర్వే తెలిపింది. లేబర్‌ కోడ్స్‌ కు సంబంధించిన గెజిట్‌ విడుదల చేసినట్లు తెలిపింది. వేతన కోడ్‌ను 31, పారిశ్రామిక సంబంధాల కోడ్‌ 28, సామాజిక భద్రతా కోడ్‌ 28, ఆరోగ్య భద్రత, పని పరిస్థితుల కోడ్‌ 26 రాష్ట్రాలు నిబంధనలు విడుదల చేసినట్లు పేర్కొంది.
 

                                                          గ్రామీణ ద్రవ్యోల్బణంలో తెలుగు రాష్ట్రాలు

గ్రామీణ ద్రవ్యోల్బణంలో తెలుగు రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయని ఆర్థిక సర్వే తెలిపింది. తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, హర్యానా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో అత్యధిక గ్రామీణ ద్రవ్యోల్బణం నమోదు చేసుకున్నట్లు పేర్కొంది. దీనికి పెట్రోలియం, దుస్తులు ధరలు పెరగడమే కారణమని తెలిపింది.

 

1122