Sep 10,2023 22:10

- మొరాకోలో 2 వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య
మరకేష్‌: ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకోలో పెను భూకంపం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. పర్యాటక ప్రాంతమైన మరకేశ్‌ - సఫి ప్రాంతంలో ఎటుచూసినా శవాలే కనిపిస్తున్నాయి. భవన శిథిలాలను తొలగించే కొలదీ మృతదేహాలు వెలుగుచూస్తున్నాయి. ఆదివారం నాటికి మరణాల సంఖ్య 2 వేలు దాటింది. శిథిలాలను పూర్తిస్థాయిలో తొలగించాల్సివున్నందున మరణాల సంఖ్య ఇంకా పెరిగేవీలుందని సంబంధిత అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడిన ప్రజలు ఒకవైపు ఒంటి నుండి రక్తమోడుతూనేవున్నా తమ వారి ఆచూకీ కోసం ఎదురుచూస్తున్న దృశ్యాలు కలిచివేస్తున్నాయి. నిద్రహారాలు మాని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. దేశమంతటా విషాదఛాయలు అలుముకున్నాయి. పర్యాటక ప్రాంతమైన మరకేశ్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని అట్లాస్‌ పర్వత ప్రాంతంలో శుక్రవారం రాత్రి 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. భూకంపం ధాటికి భారీ సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో ఇప్పటివరకు 2012 మంది మరణించారు. మరో 2,059 మంది గాయపడ్డారు. వీరిలో 1404 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగాత్రులతో నిండిపోయిన ఆసుపత్రుల వద్ద మృత్యువుతో పోరాడి అసువులు బాసిన వారి మృతదేహాలను పదుల సంఖ్యలో తరలిస్తుండటంతో అక్కడి పరిసరాల్లో బంధువుల రోధనలు మిన్నంటాయి. దేశంలో గత ఆరు దశాబ్దాల్లో సంభవించిన అతిపెద్ద విపత్తు ఇదేనని అధికారులు తెలిపారు. మరకేష్‌-సఫి ప్రాంతంలో ప్రాణ, ఆస్తి నష్టాలు అధికంగా ఉన్నాయి. భూకంప దాటికి దాదాపు 3 లక్షల మంది ప్రభావితులైనట్లు ఐక్యరాజ్యసమితి అనుబంధ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) ప్రకటించింది. మరోవైపు రెండు రోజుల గడిచినా శిథిలాల కింది చిక్కుకుపోయినవారిని రక్షించేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే రహదారులపై వాహనాలు చిక్కుకోవడం, భవన శిథిలాలు పేరుకుపోవడంతో సహాయక కార్యక్రమాలకు ఆటకంగా మారుతున్నాయి. రోడ్లపై పెద్ద పెద్ద రాళ్లు పోగుపడటంతో సహాయక బృందాలు సంఘటనాస్థలాలు, బాధితుల వద్దకు చేరుకోవడం ఆలస్యమవుతున్నదని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. భూకంపం నేపథ్యంలో మొరాకోకు సహాయం చేయడానికి అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి. రెండు దశాబ్దాల క్రితం మొరాకోతో సంబంధాలు తెంచుకున్న పొరుగు దేశం అల్జీరియా కూడా ఈ విపత్తు వేళ సహయం చేయడానికి సిద్ధమైంది. తన మిలటరీని సహాయక చర్యల్లో పాల్గోనేందుకు పంపించింది. విద్రోహ చర్యలకు పాల్పడుతుందనే ఆరోపణలతో మొరాకోతో సరిహద్దులను అల్జీరియా మూసివేసింది. దీంతో 1994లోనే ఇరుదేశాల సరిహద్దులు మూతపడ్డాయి. 2021లో ఆకాశ మర్గాన్ని కూడా మూసివేశారు.

  • దెబ్బతిన్న చారిత్రక కట్టడాలు

భూకంపంతో మొరాకోలో అనేక చారిత్రక కట్టడాలు ధ్వంసమయ్యాయి. పన్నెండో శతాబ్దంనాటి కౌటౌబియా మసీదు దెబ్బతింది. మరకేష్‌ పాత నగరంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన రెడ్‌ వాల్స్‌ కూడా దెబ్బతిన్నాయి. ఉత్తర ఆఫ్రికాలో భూకంపాలు చాలా అరుదు అని, ఈ పర్వత ప్రాంతంలో నమోదైన భూకంపాల్లో ఇది చాలా తీవ్రమైనదని అధికారులు తెలిపారు.