- స్నేహితుడి మృతదేహాన్ని ఇంట్లో పూడ్చిన వైనం
- నెలరోజుల తర్వాత వెలుగులోకి
ప్రజాశక్తి-ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్) : కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులతో గొడవపడి తన స్నేహితుడి ఇంటికి వెళ్లిన వ్యక్తి శవంగా మారాడు. మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టి...నెల రోజులుగా సహజీవనం చేశాడు మృతుని స్నేహితుడు. పోలీసుల వివరాల మేరకు.. ప్రొద్దుటూరులోని బొల్లవరంలో నివాసం ఉంటున్న సతీష్ కుమార్ (40) గత నెల 19న కుటుంబ సభ్యులతో గొడవపడి పట్టణంలోని ఈశ్వర్‌రెడ్డి నగర్‌లో ఉంటున్న తన స్నేహితుడు కిషోర్ ఇంటికి వెళ్లాడు. కిషోర్ తల్లి నెల రోజుల క్రితం హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. దీంతో ఇద్దరూ కలిసి ఇంట్లోని ఉండేవారు. సోమవారం ఉదయం కిషోర్ తల్లి హైదరాబాద్ నుంచి తిరిగి ఇంటికి వచ్చారు. ఇంట్లో దుర్వాసన వస్తుండడంతో కుమారుడిని నిలదీసింది. తాను సతీష్‌కుమార్ మద్యం సేవించి పడుకున్నామని...నిద్రలో సతీష్ చనిపోవడంతో మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టానని తన తల్లికి కిషోర్ చెప్పాడు. ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహానికి ప్రభుత్వ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. కిషోర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సతీష్‌ను కిషోర్ హత్య చేశాడా? లేదా మరేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.










