
- పెట్టుబడిదారుల ప్రయోజనం కోసమే కార్మిక చట్టాల్లో మార్పులు
- ఐక్యపోరాటాలతోనే వీటికి అడ్డుకట్ట
- 'ప్రజాశక్తి'తో సిఐటియు అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ కె హేమలత
ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి : కార్మిక చట్టాల స్థానే తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లు కార్మిక హక్కులను హరిస్తాయని సిఐటియు అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ కె.హేమలత ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారుల ప్రయోజనం కోసమే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలు సవరించిందని విమర్శించారు. ఐక్య పోరాటాలతోనే వీటికి అడ్డుకట్ట వేయాలన్నారు. గ్రామాల్లో వ్యవసాయ కార్మికులు, ఇతర వృత్తుల్లో పని చేసేవారు పెద్ద ఎత్తున పెరుగుతున్నారని తెలిపారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని, వీరంతా కలిసి పోరాటాలను తీవ్రతరం చేస్తేనే కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టగలమని అన్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, హక్కుల కోసం పోరాటాలు జరుగుతున్నప్పటికీ రోజువారీ సమస్యలకు ప్రభుత్వ విధానాలు ఏ విధంగా కారణమో క్షేత్రస్థాయిలో ప్రతి కార్మికునికీ వివరించడమే లక్ష్యంగా సిఐటియు ముందుకు సాగుతోందని తెలిపారు. భీమవరంలో జరిగిన సిఐటియు 16వ రాష్ట్ర మహాసభకు విచ్చేసిన ఆమె 'ప్రజాశక్తి'్తతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... కరోనాతో ఎంతోమంది ఉద్యోగాలు, ఆదాయాలు కోల్పోయారు. అయినా, ప్రభుత్వం ప్రస్తుతం ప్రజావ్యతిరేక సరళీకరణ విధానాలను వేగంగా అమలు చేస్తోంది. రైల్వే, బ్యాంక్, బీమా కంపెనీలను ప్రయివేటీకరించేందుకు పూనుకుంది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ విధానం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. 2008లో మొదలై కరోనాలో మరింత తీవ్రస్థాయికి చేరింది. దీని నుంచి బయటపడేందుకు పెట్టుబడిదారీ సమాజం తీవ్ర ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే లేబర్ కోడ్‌లు తెచ్చారు. మన దేశంలోనే కాకుండా యూరప్, అమెరికా వంటి అనేక పెట్టుబడిదారీ దేశాల్లోనూ ధరలు, నిరుద్యోగ సమస్య పెరుగుతోంది. వేతనాల్లో కోత, కార్మికులు సంఘం పెట్టుకోకుండా నిరోధించడం, హక్కులపై దాడి వంటి చర్యలు ప్రపంచవ్యాప్తంగా సాగుతున్నాయి. ప్రజలపై భారాలు వేయడం, కార్మికులను దోచుకోవడం, లాభాలు పెంచుకోవడం ద్వారా సంక్షోభం నుంచి బయటపడాలని పెట్టుబడిదారీ వర్గం చూస్తోంది. అందుకే కార్మికుల హక్కులపై దాడి, దోపిడీ తీవ్రతరమవుతోంది. కార్మిక చట్టాల మార్పు వెనుక ఉద్దేశం ఇదే.
సహజ వనరుల దోపిడీ అందులో భాగమే
ఆస్తుల పెంపు కోసం దేశ సంపదను లూఠీ చేయడం, ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలను సొంతం చేసుకోవడం వంటివి జరుగుతున్నాయి. పెట్టుబడిదారీ సమాజాన్ని ప్రోత్సహించే ప్రభుత్వాలు వీటిని అమలు చేస్తున్నాయి. సహజ వనరులైన భూమి, అడవులు, గనులు, సముద్రాలను సైతం వారిపరం చేస్తున్నాయి. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ పేరుతో నాలుగేళ్లలో రైల్వే స్టేషన్లు, హైవేలు, బిఎస్‌ఎన్‌ఎల్ టవర్లను కట్టబెడుతున్నాయి. ఆయిల్, గ్యాస్, పోర్టులను వారిపరం చేస్తున్నాయి. ఇప్పటికే విద్య, వైద్యం ప్రయివేటీకరించారు. ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడి పోరాటాలు పెరుగుతున్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, యూరప్ దేశాల్లోనూ పోరాటాలు జరుగుతున్నాయి. ఎప్పుడూ బయటకు రాని నర్సులు సమ్మె చేయడం, బ్రిటన్‌లో రైల్వే కార్మికులు రోడ్డెక్కడం వంటివి కొనసాగుతున్నాయి. ఎక్కడైతే ఈ పోరాటాలను సమర్థవంతంగా మలచగలుగుతున్నారో అక్కడ ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. లేనిచోట మనదేశంలోలా బిజెపి మాదిరిగా అభివృద్ధి నిరోధక, ఫాసిస్టు శక్తులు అధికారంలోకి వస్తున్నాయి. హక్కుల కోసమే కాకుండా సమస్యల పరిష్కారానికీ విధానాల సంబంధిత వ్యతిరేక పోరాటాలు సాగాల్సి ఉంది. అనేక విషయాలపై పోరాటాలు జరుగుతున్నప్పటికీ రోజువారీ సమస్యలు, వాటిని ప్రభావితం చేసే విధానాలను అర్థం చేసుకోవడం లేదు.
సిఐటియు క్షేత్రస్థాయిలో ఇప్పటి వరకూ చేరని ప్రతి కార్మికుని వద్దకూ ఇది చేరాల్సి ఉంది. దీని వెనుక ఉన్న రాజకీయం చెప్పాల్సి ఉంది. బిజెపి, వైసిపి, టిడిపి, కాంగ్రెస్ అన్నీ ఇవే పాలసీలను అమలు చేస్తున్నాయి. తమ విధానాల అమలుకు ప్రజల ఐక్యతను పాలకవర్గాలు దెబ్బతీసున్నాయి. మతం, కులాలు, ప్రాంతం, భాష వంటి చీలికలు తెస్తున్నాయి. పోరాటాలను నిర్వీర్యం చేయడం వంటివి చేస్తున్నాయి. హౌస్ అరెస్టులు, జైళ్లో పెట్టడం వంటి చర్యలన్నీ ఇందులో భాగమే. ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పించి కొనుగోలు శక్తి పెంచి సమస్యను పరిష్కరించే అవకాశం ఉన్నా అవి చేసేందుకు పెట్టుబడిదారీ విధానం ఒప్పుకోదు. ప్రజల మధ్య ఐక్యతను కాపాడుతూ క్షేత్రస్థాయిలోకి పోరాటాలను తీసుకెళ్లాలి. కార్మికులతోపాటు రైతులూ పోరాడుతున్నారు. ఢిల్లీలో రైతుల పోరాటం వెనుక కార్మికవర్గం సైతం నిలబడింది. కార్మికులు, రైతుల ఐక్యపోరాటం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. దీన్ని మరింత బలపరచాల్సి ఉంది. ప్రస్తుతం కార్మిక వర్గం పట్టణాలకే పరిమితం కాలేదు. సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఏప్రిల్ ఐదో తేదీన పెద్ద ఎత్తున ఆందోళనకు నిర్ణయించాయి. ఐదు లక్షల మందికిపైగా ఆ పోరాటంలో పాల్గోనున్నారు. ఒక్క సిఐటియు నుంచే మూడు లక్షల మంది రానున్నారు. రాబోయే రోజుల్లో జరగబోయే సిఐటియు అఖిల భారత మహాసభలోనూ వీటిపై చర్చలు జరగనున్నాయి.