Nov 17,2023 11:09

ప్రజాశక్తి- కొవ్వూరు, రాజమహేంద్రవరం ప్రతినిధి : ఫ్లెక్సీ వివాదంతో ఆత్మహత్య చేసుకున్న బొంతా మహేంద్ర కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన హోం మంత్రి తానేటి వనితను దళితులు అడ్డుకున్నారు. హోం మినిస్టర్‌ గోబ్యాక్‌ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. ఆమెను కారులో నుంచి బయటకు దిగనివ్వకుండా దిగ్బంధించారు. మహేంద్ర మృతికి అధికార పార్టీలోని గ్రూపు విభేదాలే కారణమని రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. స్థానిక ఎమ్మెల్యే, హోం మంత్రి తానేటి వనిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జునను పరామర్శకు పంపించింది. ఈ నేపథ్యంలో దొమ్మేరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల సహకారంతో మేరుగ నాగార్జున, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌కృష్ణ మాత్రమే మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, రూ.20 లక్షల చెక్కును అందించారు. ప్రభుత్వపరంగా అన్నివిధాలా ఆదుకుంటామని వారు బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడారు. హోం మంత్రి గెలుపు కోసం గత ఎన్నికల్లో మహేంద్ర పనిచేశారన్నారు. పోలీసులు నిర్భంధించారని హోం మంత్రికి సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని వాపోయారు. మంత్రి పట్టించుకుంటే మహేంద్ర బతికేవాడని తెలిపారు. దొమ్మేరులోని స్థానిక క్రైస్తవ శ్మశానవాటికలో మహేంద్ర అంత్యక్రియలు నిర్వహించారు.