ఎండపల్లి భారతి మట్టిలో మాణిక్యం. ఆమె 2016లో 'ఎదారి బతుకులు' కథాసంపుటి ద్వారా అనతికాలంలోనే మంచి పసకలిగిన రచయిత్రిగా పేరు తెచ్చుకున్నారు. పూర్వ చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలోని గారబురుజు, కర్ణాటక సరిహద్దుల్లోని ముదిమడుగు ప్రాంతాల్లోని దళితస్త్రీల జీవితాలు ఎదారి బతుకుల్లో కథలకు ఇతివృత్తాలు.
ఈ కథల్లో శాస్త్రీయ భౌతికవాదం, నిసర్గమైన దళితవాదం, బలమైన దళితస్త్రీ అస్తిత్వ సంవేదనలు కనిపిస్తాయి. భారతి దళిత జీవితాన్ని స్వయంగా జీవించి, ఆ కష్టాన్ని, ఆ నొప్పిని అనుభవించి రాసిన రచయిత్రి కావడం వల్ల కథల్లో ఆ సహజత్వం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఈ కథలు దళిత జీవితాల్ని వర్ణిస్తాయి. దళితస్త్రీ జీవితాల్ని విపులంగా వర్ణిస్తాయి. ఆ జీవితాల్లోని సమస్యల్ని చూపి, ఇంత దుర్భరమైన జీవితాలు ఇంకా ఉన్నాయా? ఇంత అణచివేత, ఇంత అన్యాయం ఇంకా జరుగుతున్నదా? ఇంత అనాగరికత ఇంకా ఉందా? అని విస్మయం చెందేలా చేస్తాయి. కానీ సదరు సమస్యలకు పరిష్కారాలు చూపే ప్రయత్నం చెయ్యాల్సిన స్థాయిలో చెయ్యలేదు. దానికి కారణం రచయిత్రికి ఉన్న పరిమితులు. ఆమె పెద్దగా చదువుకోలేదు. అయినా నిసర్గమైన ప్రతిభతో ఆమె దళిత జీవితాల్ని, దళితస్త్రీ జీవితాల్ని అక్షరబద్ధం చేసి భద్రపరుస్తున్నారు. అనుభవపూర్వకంగా పడ్డ ఆవేదనతో మౌలికంగా ప్రశ్నిస్తున్నారు.
శ్రమజీవులు కాబట్టి దళితస్త్రీలకు కుటుంబంలో నిర్ణయాధికారం ఉంటుందన్నది ఒక సాధారణ అభిప్రాయం. భారతి గారి కథల్ని చూస్తే ఈ అభిప్రాయాన్ని కొంతవరకూ సడలించుకోవాల్సి వస్తుంది. 'అంటిత్తులు' కథలో రంగమ్మత్త, రామ్మామ అని ఇద్దరు ఒద్దికైన దంపతులున్నారు. రంగమ్మ రామన్న మనసు గెలిచింది. అతనితో ఇంటి చాకిరీ, ఒంటి చాకిరీ చేయించుకుంటుంది. వాళ్ళ ఒద్దిక అలాంటిది. అందుకే ఊర్లోవాళ్ళు ఆ జంటకి అంటిత్తులు అని మారుపేరు పెట్టుకున్నారు. 'తాగుబోతు' కథలో లచ్చుమత్త మొగుడు కొండప్ప మొహమాట పెడితే ఒకసారి సారా తాగుతుంది. తర్వాత మొగునికి తెలియకుండా తాగుతూ పక్తు తాగుబోతుగా తయారవుతుంది. ఆరోగ్యరీత్యా వైద్యుల సలహా మేరకు కొండప్ప తాగడం మానేసినా లచ్చుము తనకోసం సారా తెప్పించుకునే సాధికారత కలిగుంది. 'తప్పేది ఒప్పేది' కథలో కడింటి వదిన ఎవరు ఆకలితో ఉన్నా అంత కడిపెట్టే మనసు, అధికారం కలిగుంది. చివరకు తను పదిమందితో ఒళ్ళు పంచుకున్నా ఆమె భర్త ఆమెని ఏమీ అనడు. ఈ సకృత్తు ఉదాహరణలు తప్ప ఎదారి బతుకుల్లోని ప్రతి కథలో, ప్రతి ఇంట్లో స్త్రీ కుటుంబంలో నిర్ణయాధికారం లేకపోగా, నానా రకాల అణచివేతకు, హింసకూ గురవుతుంది. దీన్ని ఆవైతే పేయదూడ ఆడదైతే మగపిల్లోడు' కథలో సూచనాప్రాయంగా; ఇత్తలిబింది, నక్కాముట్టి, కథల్లో స్పష్టంగా చూడొచ్చు. ఈ కథల్లోని దళిత స్త్రీలు మహిళలుగా తమ అస్తిత్వాన్ని చాటుకోవడం కోసమే కాకుండా తమ కుటుంబ ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరచుకుని మానవులుగా గౌరవాన్ని, సామాజిక అస్తిత్వాన్ని కాపాడుకోవాలని శతవిధాలా పాటుబడతారు. కూలీనాలీ చేస్తూ, పొదుపు పాటిస్తూ ఇంటికి ఒక్కొక్క వస్తువే కొనుక్కుంటూ ఉంటారు. ఇత్తలిబింది, వాసాలమింద కప్పడం, పూలపెట్ట, బొగ్గులబట్టి, చిక్కెంటుకులు, కడుపులు కాల్చిన కందిబేడలు, నల్లడబ్బు, పసావు కథల్లో ఇలాంటి ఆరాటం కనబడుతుంది. మరోపక్క మగవాళ్ళు పనిచేసి ఇంటిని చక్కబెట్టడం కాదు కదా, ఆడవాళ్ళు సంపాదించిన డబ్బుని లాక్కుని సారాకు తగలేస్తారు. ఆడవాళ్ళు పొదుపుచేసి కొనుక్కున్న చెంబుల్ని, బిందెల్ని కూడా ఇంటినుండి ఎత్తుకెళ్ళి అమ్మేసి పేకాటలో పోగొట్టేస్తారు. అలా ఆ..
దళితస్త్రీల అస్తిత్వ పోరాటం నీరుగారిపోతుంటుంది.
కాగా, ఆధునికతవల్ల మానవ సంబంధాలు అడుగంటిపోవడం శీర్షిక కథ ఐన 'ఎదారి బతుకులు', 'బొగ్గు దవడకేసుకుని' 'సచ్చినోళ్ళ గేపకం' కథల్లో చక్కగా వర్ణించబడింది. 'గంగమ్మే బెదిరిపోయె' కథ హాస్యకథలా అనిపించినా, లోతుగా పరిశీలిస్తే దళితస్త్రీలలోని ఆకలిబాధ తెలుస్తుంది. 'ఈరావ్వ ఏమి తినబెట్టిందో' కథలో ఈరావ్వ, 'మొగుని పొటుకులు' కథలో సాలత్త, 'పాపం గెంగవ్వ' కథలో గెంగవ్వ ఇంటిలో మొగుళ్ళ నుండి చెప్పుకోలేని లైంగికహింసకు గురవుతారు. 'అవ్వ తలపులు' కథలో లచ్చుమవ్వ రంగారెడ్డి, వరదారెడ్డి, యెల్లమోళ్ళ బుచ్చన్నల నుండి లైంగికహింసని ఎదుర్కొంటుంది. తన కోరిక తీర్చలేదన్న కసితో బుచ్చన్న చాడీలు చెప్పగా, తన మగడు కూడా తనని తన్ని తగలేసి ఇంట్లోనుండి తరిమేస్తే ఒక రాత్రంతా తను బిడ్డలతోబాటు అడవిలోని ఒక సత్రంలో బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుంది. ఉన్నత కులాలు దాహం తీర్చుకోడానికి, పంటలు పండించుకోడానికి బావులు, చెరువులు తవ్వాల్సి వస్తే, పొలాల్లో పని చెయ్యాల్సి వస్తే దళితుల శ్రమని వాడుకోడానికి ఏమీ అడ్డురాదు. కానీ వాళ్ళకి గ్లాసుతో గుక్కెడు నీళ్ళు ఇవ్వాల్సి వస్తే కులం అడ్డొస్తుంది. తట్టలో పిడికెడు మెతుకులు పెట్టాల్సి వస్తే కులం అడ్డొస్తుంది. చివరకు వాళ్ళని తాకాల్సి వచ్చినా, వాళ్లకి దగ్గరగా కొంతసేపు ఉండాల్సి వచ్చినా కులం అడ్డొస్తుంది. కానీ వాళ్ళు చేసే కవుసుకూర తినడానికి కులం అడ్డురాదు. శ్రమజీవులైన దళితస్త్రీలను లైంగికంగా వాడుకోడానికి కులం అడ్డురాదు. ఇవి 'దప్పి', 'మాయన్న సదువు' 'కుట్టేవానికి మెట్టు కరువు' 'అవ్వ తలపులు' కథల్లో కనబడతాయి. '
'సచ్చి సాదించడం' కథలో ఇద్దరు ఆడవాళ్ళు తమని హింసించి తరిమేసిన తమ మొదటి మొగుడు చనిపోతే సమాజపు కట్టుబాట్లకి కట్టుబడి ప్రస్తుతం తమ భర్తలు బతికున్నా ముండ మొయ్యాల్సి వస్తుంది. దీనికి విరుద్ధంగా అంటిత్తులు, తాగుబోతు కథల్లో దళిత దంపతుల మధ్య అరమరలులేని స్వచ్ఛమైన ప్రేమ కనబడుతుంది.
దళితుల్లో మాల, మాదిగ అనేవి కులాలు కావు. శాస్త్రవేత్తలు, మేధావులు చెబుతున్నట్లు అవి ద్రవిడజాతిలో ఉపజాతులు. ద్రవిడ జాతిలోని భౌతికవాద దృక్పథం ఇప్పటికీ ఆ జాతుల్లో కనబడుతుంది. నాగరికత పేరుతో మానవ సంబంధాలను జటిలం చేసుకోవడం ఆ జాతి సహజ లక్షణం కాదు. అగ్రవర్ణాల్లో మనషులు చనిపోయినప్పుడు దళితులకు దానంగా పెట్టే సావు బియ్యం దళితులు కూడా తినరు. అలా తింటే అరిష్టం జరుగుతుందని ఒక అభిప్రాయం ఉంది. దాన్ని సాకుగా చేసుకుని దళిత పురుషులు ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఆకలితో అల్లాడుతున్నా ఆ బియ్యాన్ని అంగడిలో అమ్మేసి వచ్చిన డబ్బుతో సారా తాగి జల్సాలు చేసుకుంటారు. 'సావుబియ్యం' కథలో సావు బియ్యం వండుకుని తిన్న కథకురాలికి వాళ్ళ నాన్న అది అరిష్టం అని చెప్పగా భయపడి ఆ విషయం బోయకొండవ్వకు చెబుతుంది. అప్పుడు బోయకొండవ్వ ''తిక్కల బిడ్డా, సావుబియ్యమూ, బతుకుబియ్యమూ అని ఉండవు. కాలే కడుపును చల్లార్చే బియ్యమే ఉండేది. మగ నా బట్టలు ఇల్లూ వాకిలీ అనుకోకుండా సంపారిచ్చిందంతా సారాయంగట్లో పోసేసి వస్తుంటే నువ్వు మటుకు ఏమి చేస్తావు'' అని భయం పోగొడుతుంది. అలాగే 'తప్పేది ఒప్పేది' కథలో కడింటి వదిన ఊళ్లోకి వచ్చిన అతిథులను ఎవరు పట్టించుకోకపోయినా తాను చేరదీస్తుంది. అంతకడి ఉడకేసి పెడుతుంది. చాప ఇచ్చి పడుకోమని చెబుతుంది. ఊళ్ళో అమ్మలక్కలు ఆమెపై ఏమేమో గుసగుసలుపోతారు. ఆమె ఒట్టి వ్యభిచారి అని, ఊర్లో మగోల్లందరికీ ఒళ్ళు అప్పగించేస్తుందని అభాండాలు వేస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన పెద్దమ్మ ఒక పిట్టకథ చెప్పి కష్టాల్లో ఉన్న సాటి మనిషిని ఆదుకునే గుణం లేని ఆ ఆడంగుల నోళ్ళని మూయిస్తుంది. అలాగే కథకురాలు తనని నిలదీసినప్పుడు కడింటి వదిన ''అదికాదు బారతమ్మా, ఒకడు నన్నడిగినాడంటే, నామింద ఎంత ఆశించుకోనుంటాడు? నేను కాదంటే ఎట్లా? అదే నేను ఎవరిమిందన్నా ఆశ పడితే, వాళ్ళు కాదంటే, ఎంత వెతగా ఉంటాది? వాళ్లకు గూడా అంతే కదా.'' అని చెబుతుంది. అలా ఈ రెండు సందర్భాల్లో దళితజాతుల్లో ఉన్న భౌతిక దృష్టి స్పష్టంగా వెల్లడవుతున్నది. ఆ శాస్త్రీయ దక్పథం 'సమేదాసరి' కథలో కూడా కనబడుతుంది.
ఈ కథల్లో దళితభాషా సంస్క ృతులు సహజశోభలతో దర్శనమిస్తాయి. వాటిని అలా పిలవడం సమంజసం కాకపోతే కర్ణాటక సరిహద్దుల్లోని పుంగనూరు, రాయల్పాడు మధ్యలోని మదనపల్లె భాషా సంస్క ృతులని అని పిలవవచ్చు. అది కూడా సమంజసం కాదనిపిస్తే కర్ణాటక సరిహద్దుల్లోని పుంగనూరు, రాయల్పాడు మధ్యలోని మదనపల్లె ప్రాంత దళిత భాషా సంస్క ృతులని అని పిలవ్వొచ్చు. ఈ కథల్లోని భాష కొండకచో బూతుగా అనిపించవచ్చు. అదంతా జీవితంలో భాగమైనప్పుడు దాన్ని ఎలా ఆ జీవితాల నుండి విడదీయగలం? తీవ్రమైన, తీవ్రత అవసరమైన జీవిత సందర్భాల్ని వర్ణిస్తున్నప్పుడు కూడా భాషాపరమైన నియంత్రణ అవసరం ఏముంది ?
అయితే, ఈ కథల్లో ధిక్కారస్వరం అంత స్పష్టంగా ఉండదు. ఎక్కడో కంటికి సరిగా కనిపించకుండా ఒక సన్నని పొరలాగా, చెవికి సరిగా వినిపించకుండా ఒక సన్నని జీరలాగా ఉంటుంది. అయినా అది చాలా మౌలికమైనది. మెతువులో గట్టి లాంటిది. 'మాయన్న సదువు' కథలో కథకురాలి అన్న చదువు సజావుగా కొనసాగకుండా మధ్యలోనే నిలిచిపోడానికి, అతడు శ్రమజీవిగా మిగిలిపోడానికి అగ్రవర్ణ భావజాలానికి అలవాటుపడ్డ సహ విద్యార్థులు, అయ్యవార్లే కారణమన్న ధిక్కారం మసకమసగ్గా ఉంది. గురువుదేవర కథలో అది మరికొంత స్పష్టంగా కనబడుతుంది. ఈ కథల్లోని దళితస్త్రీలు కూడా తమ ఇళ్లలోని మగవాళ్ళ ఆగడాలకు నొచ్చుకుంటారే తప్ప తిరుగుబాటు చెయ్యరు. ఈ విషయమై రచయిత్రిని కదిపినప్పుడు తాను తన చుట్టూ కనిపిస్తున్న సమాజాన్ని తన చేతనైంతలో రాసుకొచ్చానని, ధిక్కారం లాంటి పదాలు కూడా తనకు తెలియవని చెప్పుకొచ్చారు. భారతి లాంటి రచయితలు ఇంకా రావాలి. వాళ్ళు ఉన్నత చదువులు చదివి జీవితాలను లోతుగా అధ్యయనం చేసి, వాళ్ళు రాస్తున్న జీవితాల్లోని సమస్యలకు సిద్ధాంతికమైన పరిష్కారాలని చూపించాలి. అవసరమైన చోట తమ ధిక్కారస్వరం సాధికారంగా వినిపించాలి.
- కవితశ్రీ










