న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో యోగి సర్కార్ అండదండలతో హిందూ మతతత్వ గ్రూపులు చెలరేగిపోతున్నాయి. వర్సిటీల్లో పనిచేస్తున్న దళిత ప్రొఫెసర్లు, లెక్చరర్లను టార్గెట్ చేస్తూ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నాయి. 'దుర్గా నవరాత్రి' గురించి వారణాసి వర్సిటీలో ఒక దళిత ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ హిందూమతతత్వ గ్రూపులు దుమారం రేపాయి. ఎబివిపి, బిజెపి నాయకుల బెదిరింపులు, ఒత్తిడికి తలొగ్గిన వారణాసి వర్సిటీ పాలకవర్గం, మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మిథిలేశ్ కుమార్ గౌతమ్‌ను ఉద్యోగంలో నుంచి డిస్మిస్ చేసింది. ''ముఖ్యంగా మహిళలకు ఒక సూచన చేయదలుచుకున్నా. నవరాత్రి సమయంలో ఉపవాసం ఉండటం కన్నా భారత రాజ్యాంగాన్ని, హిందూ కోడ్ బిల్లును చదవాలని వారికి సూచిస్తున్నా''నని సామాజిక మాధ్యమంలో సందేశాన్ని గౌతమ్ పోస్ట్ చేశారు. భయం, బానిసత్వం నుంచి మహిళలు విముక్తి పొందాలని ఆకాంక్షించారు. దీనిపై ఆర్‌ఎస్‌ఎస్ విద్యార్థి సంఘం ఎబివిపి నాయకులు, కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న వారణాసి వర్సిటీ, ప్రొఫెసర్ గౌతమ్‌ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసింది.
మహిళా సాధికారతపై మాట్లాడటం నేరమా : ప్రొఫెసర్ గౌతమ్
''భారత రాజ్యాంగం, హిందూ కోడ్ చదవాలని మహిళలకు సూచించటం తప్పా? మహిళా సాధికారతపై మాట్లాడటం నేరమా? కనీసం నా వైపు నుంచి వివరణ కోరకుండా.. చర్యలు చేపట్టారు'' అని గౌతమ్ ఆవేదన వ్యక్తం చేశారు. హిందూత్వ శక్తులు తెచ్చిన ఒత్తిడి, బెదిరింపులకు వర్సిటీ యాజమాన్యం తలొగ్గిందన్నారు.ఈ ఘటనపై వర్సిటీ రిజిస్ట్రార్ సునీతా పాండే మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ''ప్రొఫెసర్ గౌతమ్ చేసిన వ్యాఖ్యలు వర్సిటీలో తీవ్ర దుమారం రేపాయి. విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆగ్రహంతో ఉన్నారు. వర్సిటీ అడ్మిషన్లు, పరీక్షల ప్రక్రియకు ఇది ఆటంకంగా మారింది. దీనిని పరిగణలోకి తీసుకొని వర్సిటీ నిబంధనల ప్రకారం గెస్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న గౌతమ్‌ను విధుల నుంచి తొలగించా''మని పేర్కొన్నారు. వర్సిటీలోకి ఆయన ప్రవేశాన్ని కూడా నిషేధించామని తెలిపారు.










