సాహిత్య ప్రపంచంలో కాళీపట్నం రామారావు పేరు తెలియని వారు లేరు. కథల కోసం 'కథానిలయం' స్థాపించిన కథానాయకుడు. 'చిత్రగుప్త' మొదలుకొని సుమారు ఏభై కథలు రాశారు. సమాజాన్ని చైతన్యం చేయడం కోసం, జాగృతి కలిగించడం కోసం, కలం పట్టిన కథకుడు కారా. దళిత, శ్రామిక, మధ్య తరగతి, అట్టడుగు బడుగు బలహీన వర్గాల వారి జీవితాలను కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించిన విఖ్యాత సహజ కథకుడు ఆయన. 1924 నవంబర్ 9వ తేదీన జన్మించారు. 2021 జూన్ 4వ తేదీన మరణించారు.
కారా తన కథల్లో విజ్ఞతకూ, చైతన్యానికీ చాలా ప్రాధాన్యం ఇచ్చారు. యజ్ఞం, ఆర్తి, చావు కథల్లో దళితుల జీవితాలు ఎంత దుర్భరంగా వున్నాయో చిత్రీకరించారు. దళితుల బడబాగ్నిని కళ్ళకు కట్టినట్లు వివరించిన కథ 'యజ్ఞం'. దళితుల్లో సామాజిక స్పృహను కలిగించిన కథ 'ఆర్తి'. చైతన్యాన్ని రేకెత్తించిన కథ 'చావు'. ఈ మూడు కథల్లోనూ దళితుల జీవితాలను ప్రధాన పాత్రలుగా తీసుకొని చక్కగా చిత్రీకరించారు.
తెలుగు కథారంగంలో 'యజ్ఞం' కథ ఒక పెద్ద సంచలనం. 1966లో 'యువ' దీపావళి ప్రత్యేక సంచికలో వచ్చింది. వర్తమాన సామాజిక ఆర్ధిక రాజకీయ, సాంస్కృతిక వైరుధ్యాలు సమాహార రూపానికి ఒక కథా దర్పణం 'యజ్ఞం'. శ్రీకాకుళానికి 15 కిలోమీటర్ల దూరంలో వున్న సుందరపాలెం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ పల్లెటూరితో పాటు, అక్కడ వున్న వ్యక్తుల జీవన విధానాలను, మనస్తత్వాలను ఉత్తరాంధ్ర మాండలిక భాషను చిత్రీకరించారు కారా.
దళిత రైతు అప్పల్రాముడు దళారి గోపన్న దగ్గర, అవసరం కోసం కొంత సొమ్ము అప్పు తీసుకుంటాడు. యేళ్ళ తరబడి వడ్డీతో ఆ అప్పు చాలా పెరిగిపోతుంది. ఇవ్వడానికి అప్పల్రాముడి దగ్గర డబ్బులు వుండవు. చివరకు ఈ సమస్య ఆ ఊరి పెద్ద మనిషి శ్రీరాములు నాయుడు దగ్గరకు చేరుతుంది. ఈలోపు అప్పల్రాముడి అప్పును తామే చెల్లించి, అతనితో వెట్టిచాకిరి చేయించుకోవడానికి కొందరు పెద్దలు పన్నాగం పన్నుతారు. ఎవరు ఏమి మాటలాడినా అప్పల్రాముడు మాటలాడడు. ఏమి చేయాలో తెలియక చివరకు అప్పల్రాముడి అప్పును, నేను తీరుస్తానంటాడు శ్రీరాములు నాయుడు. అప్పుడు అప్పల్రాముడు నోరు విప్పుతాడు.
తరతరాల నుంచి జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను, దౌర్జన్యాలను, మోసాలను, దోపిడీలను, పూసగుచ్చినట్లు చిట్టా విప్పి చెబుతాడు. ఆ మాటలతో ఊరి జనం చైతన్యవంతులవుతారు. అప్పల్రాముడు చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజమే కదా! అనుకుంటారు. తన అప్పును ఎవ్వరూ తీర్చవలసిన అవసరం లేదని, తానే కొంచెం పొలం అమ్మి తీర్చుతానంటూ కుండ చెప్పుతాడు అప్పల్రాముడు. కరణాన్ని పత్రం రాయమంటాడు. అప్పల్రాముడి కొడుకు సీతారాముడు, తండ్రి మాటలకు అడ్డుపడతాడు. బతికినంత కాలం చాకిరీ చేసి, గోపన్న అప్పు తీరుస్తాను కానీ, పొలం కాసింతైనా అమ్మడానికి వీలులేదని కరాఖండిగా చెబుతాడు. తన మాటకు కట్టుబడి శ్రీరాములు అమ్మకం పత్రం మీద నిశానీ పెట్టి, కొడుకుల చేత మనవళ్ళ చేత, నిశానీ వేయిస్తాడు. తన కొడుకు తనలాగ జీవితాంతం వూడిగం చేయడం ఇష్టం లేక సీతారాముడిని నరికి గోతంలో వేసుకుని ధర్మమండపం ముందు దభాలున పడేస్తాడు అప్పల్రాముడు. దీనితో కథ ముగుస్తుంది.
తీర్పు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా లేనప్పుడు, తను ఏమిా చేయలేనని నిర్ధారణకు వచ్చినప్పుడు ఫ్యూడల్ వ్యవస్థపై నిరసనగా, బానిస బతుకు మీద తిరుగుబాటుగా అప్పల్రాముడు తన కన్న కొడుకును చంపుకుంటాడు. అతడు అలాంటి కఠినమైన ఉన్మాద స్థాయికి తీసుకెళ్ళిన పరిస్థితులను మనం 'యజ్ఞం' కథలో చూస్తాం. ఈ కథలో దోపిడీశక్తుల బండారం బట్టబయలు చేస్తాడు కథకుడు. దళిత రైతుల పరిస్థితులను వున్నది వున్నట్లు శక్తివంతంగా చిత్రీకరించాడు. మనిషి తను ఏమీ చేయలేనప్పుడు, కోపం పెనుతుఫానుగా పెల్లుబికినప్పుడు తనను తాను హింసించుకుంటాడు. అదొక ఉన్మాదస్థితి. పరిస్థితులు తారుమారు అయినప్పుడు తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరగనపుడు కలిగే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఈ కథ ముగింపులో మనం అదే చూస్తాం. ఇక్కడ కథకుడు బలంగా గట్టిగా చెప్పదలచుకున్నది ఏమంటే బానిసగా జీవితాంతం వెట్టిచాకిరీ చేస్తూ ఈ సమాజంలో ఏ ఒక్కడూ బతకకూడదనే. సమాజంలో ఆర్ధిక సామాజిక వ్యత్యాసాలు ఏర్పడడానికి గల కారణాలను విశ్లేషణాత్మకంగానూ, వివేచనాత్మకంగానూ రాసిన కథ ఇది. ఈ కథ మీద అనేక వాదోపవాదాలు జరిగాయి.
దళితుల జీవన నేపధ్యాన్ని తీసుకుని 'ఆర్తి' కథ కారా. ఈ కథలో కథకుని సామాజిక దృక్పథం చాలా స్పష్టంగా కన్పిస్తుంది. సన్ని, పైడయ్య భార్యాభర్తలు. కుటుంబ తగాదాల వల్ల దంపతుల బంధం దూరమయ్యే పరిస్థితి వస్తుంది. సన్ని తల్లి ఎర్రమ్మ, పైడయ్య తల్లి బంగారి ... మధ్య గొడవలు సన్ని, పైడయ్యల ఎడబాటుకు ప్రధాన కారణమవుతుంది. ఎర్రమ్మ తన కూతురు సన్నిని పండగకు ముందు అత్తవారి ఇంటికి పంపడానికి ఇష్టపడదు. కారణం పండగ ముందు కూలిపనులు ఎక్కువగా వుంటాయి. కూతురు తన దగ్గర వుండే కూలి చేస్తే డబ్బులు వస్తాయని ఆమె ఆశ. బంగారి కూడా తన కోడలు తన ఇంటికి వస్తే కూలి పనులు చేసి డబ్బులు సంపాదించవచ్చునని భావిస్తుంది. ఇక్కడ వారిద్దరి ముఖ్యమైన సమస్య ఆర్ధికాంశమే! మనిషి జీవితంలో ప్రధాన సమస్య ఆకలి. ఆకలి వీళ్ల మధ్య పెద్ద చిచ్చు రేపుతుంది.
ఊరు పెద్ద అసిర్నాయుడు ఈ తగువుకు తీర్పు ఇస్తాడు. సన్నీ, పైడయ్య కలిసి వుంటే మంచిదని చెబుతాడు. ఎర్రమ్మకి అన్ని విధాలా నచ్చ చెప్పి, వియ్యపురాలు బంగారితో కలిసి మెలిసి, కలుపుగోలుగా వుంటే కలిగే ప్రయోజనాలను వివరంగా తెలియజేస్తాడు. ఇద్దరికీ సయోధ్య చేస్తాడు. చివరకు
వియ్యపురాళ్ళు ఇద్దరూ కలుస్తారు. ఈ బంధం తాత్కాలికమా? శాశ్వతమా? అనే సంశయాలతో కథ ముగుస్తుంది. దళితుల సామాజిక ఆర్ధిక మానవీయ కోణాలు ఈ కథలో కనిపిస్తాయి.
చావు కథ 'సృజన' మాసపత్రికలో 1971 మార్చిలో వెలువడింది. నారమ్మ అనే దళిత ముసల్ది చనిపోతుంది. ఆమెను దహనం చేయడానికి అవసరమైన కట్టెల కోసం పడిన కష్టాలే ఈ కథలోని ఇతివృత్తం. కులాల మధ్య వ్యత్యాసాలు, పేద ధనికుల మధ్య తారతమ్యాలు; పెత్తందారుల అహంకారం, ప్రకృతి వనరులను అప్పనంగా దోచుకోవడం, దళిత జనాలను ఇంకా బానిసలుగా తయారు చేయడానికి ప్రయత్నించడం ... ఈ కథలో చర్చకు వస్తాయి. అభ్యుదయ, విప్లవ దృక్పథం వున్న యువకులు తమ హక్కుల సాధన కోసం ఎంతవారినైనా ఎదురు తిరుగుతారనీ, ఏకమై పోరాడతారనీ, దళిత చైతన్యాన్ని కలిగిస్తారనిఈ కథలో చెబుతారు.
అక్కివరం మాలపేటలో సావాలు, ఎరకయ్య దంపతులు ఉంటారు. వీరికి ఆరుగురు సంతానం. పెద్ద కొడుకు (పేరు లేదు), పోలమ్మ, నారెమ్మ, సిమ్మాద్రి, దాలి, ఆఖరి కొడుకు పేరు పెంటగాడు. ఈ కుటుంబంలో దారిద్య్రం విలయతాండవం చేస్తుంది. ముసలివాళ్ళను, చిన్నపిల్లలను ఇంటిలో వొదిలిపెట్టి ఇంటిల్లపాది కూలిపనికి వెళ్ళిపోతారు. ఉదయం వెళ్ళితే రాత్రికే వస్తారు. మధ్యలో వెళితే కూలి పోతుంది.
దళిత ముసల్ది నారమ్మ చనిపోతుంది. సిమ్మాద్రి, వాళ్ళ అమ్మకు, నాన్నకు నాయనమ్మ నారమ్మ చనిపోయిన విషయం తెలియజేయదు. చెప్పకపోవడానికి కారణాలు వున్నాయి. అంతకుముందు రెండు మూడుసార్లు ఆమెకు బాగా లేకపోతే చనిపోయిందని భావించి, వెళ్ళి చెబితే అమ్మనాన్న పని వదలివేసి ఇంటికి వస్తారు. పని మధ్యలో ఆపేసి వచ్చారు కాబట్టి, యజమాని కూలిడబ్బులు ఇవ్వడు. పొద్దున్నే అయితే ఏ కబురైనా చెప్పు, మధ్యాహ్నమైతే కబురు పంపవొద్దని చెల్లెలు పోలమ్మ, అక్క సిమ్మాద్రితో ఇంతకుముందే చెబుతుంది. ఆ కారణంగా నారమ్మ చనిపోయిన సంగతి, సిమ్మాద్రి ఎవరికీ చెప్పకుండా ఊరుకుంటుంది.
నారమ్మ ఎప్పటి నుంచో అనారోగ్యంతో బాధపడుతుంది. దానికితోడు విపరీతమైన చలి. కప్పుకోవడానికి దుప్పటి కూడా వుండదు. ఇంటిలోని గుడ్డలన్నీ కప్పుకుంటుంది. సరిపోకపోతే, గోనె సంచులు కప్పుకుంటుంది. అయినా తీవ్రమైన చలిని భరించలేక చచ్చిపోతుంది. సిమ్మాద్రికి కూడా చలి వేస్తుంది. కప్పుకోవడానికి గుడ్డలు వుండవు. ఇంటిలోని గుడ్డలన్నీ నారమ్మ శవం మీదే వుంటాయి. చలిని భరించలేక శవంపై కప్పివున్న గుడ్డలు తీయడానికి ప్రయత్నిస్తుంది. వారి పరిస్థితి ఎంత దారుణంగా వుందో దీని బట్టి మనకు అర్ధమవుతుంది.
సాయంత్రం అందరూ ఇంటికి చేరుకుంటారు. శవాన్ని బయటకు తీస్తారు. ఆ పేటలోని జనమంతా చేరుతారు. అంత్యక్రియల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కాల్చడానికి కట్టెలు లేవని కోడలు సావాలు అంటుంది. కట్టెలు దొరక్కపోతే పాతిపెట్టడమే మంచిదని పొరిగింటి లచ్చయమ్మ సలహా ఇస్తుంది. కట్టెల కోసం నాయుడు గారింటికెళితే ఆయన భార్య, చలిలో కుదరదని రేప్పొద్దున రమ్మని తలుపు వేసుకుంటుంది. మరో ఇద్దరు ముగ్గురి దగ్గరకు వెళ్ళినా పని జరగదు.
శవాన్ని కాల్చడమే ధర్మమనీ, లేకపోతే జీవుడు దెయ్యమౌతాడని అప్పారావు అంటాడు. ప్రతి ఇంట పశువులను కట్టే కొయ్యను సేకరిస్తే, శవదహనానికి సరిపోతుందని చెబుతాడు. దానికి పెద్దలు అంగీకరించరు. ఆ పని దొంగతనం కిందకు వస్తుంది కాబట్టి మనం ధర్మమార్గంలో నడుద్దామంటారు. చివరకు శవాన్ని పాతిపెట్టడానికి, సిద్ధపడి శ్మశానానికి తీసుకెళతారు. అక్కడ గొయ్యి కూడా తీసి రడీగా వుంచుతారు.
ఈలోపు ఎరకయ్య పెద్ద కొడుకు సీతయ్య, మరికొంతమంది యువకులు తెగించి పందిరి అప్పయ్య కళ్ళంలో వున్న కట్టె మోపులను తీసుకువచ్చి, పెద్దల ముందు పడేస్తారు. ఆ కట్టెలతో తన తల్లి నారమ్మ శవాన్ని ఎరకయ్య దహనం చేస్తాడు. అతడి మొఖంలో ఎంతో ప్రశాంతత కన్పిస్తుంది. రేప్పొదున్న ఈ యువకులను దొంగలుగా నిందిస్తే అది తన తప్పేనని, తనను శిక్షించమని అడుగుతానని నిర్ధారించుకుంటాడు. సూరయ్య అనే పేట పెద్ద మనిషి ద్వారా కథకుడు ఈ కథను వివరిస్తాడు. డబ్బుగల వాళ్ళు చనిపోతే దీపాలు, దహనానికి గంధపు చెక్కలు, ఆవు నెయ్యిలాంటి ఆడంబరాలు వుంటాయి. అదే పేదలు చనిపోతే శవం వద్ద చనిపోయిన వాళ్ల గురించి చెప్పుకునే కబుర్లు, కథలే వుంటాయని పేర్కొంటాడు. అప్పారావు పాత్ర ద్వారా కథకుడు అభ్యుదయ భావాలు పలికిస్తాడు. అవసరమైతే పెద్దలను ఎదిరించాలని అంటాడు. ఇంకా ఎన్నాళ్ళు ఇలా పెద్ద వాళ్ళ కాళ్ళ కింద పడివుండాలని నిలదీస్తాడు. ఆ ప్రభావంతో సూరయ్య ఆలోచనల్లో మార్పు వస్తుంది. భారతదేశంలో దళితులకు బతుకే కాదు చావు కూడా అత్యంత సమస్య అని చెప్పిన కథ ఇది. దళితుల సుదీర్ఘమైన వాస్తవిక జీవిత సమస్యల్ని ప్రతిభావంతంగా చిత్రించిన కథ 'చావు'. స్వాతంత్య్రం వచ్చి డబ్బై ఐదు ఏళ్లు అయినా దళితుల బతుకు ఇలాగే వుంది. వర్గ దృష్టితోనూ, సామాజిక దృక్పథంతోనూ, దళిత చైతన్యంతోనూ, ఆర్ధిక విధానంతోనూ లోతుగా పరిశీలిస్తే 'యజ్ఞం' కంటే 'ఆర్తి', దానికంటే 'చావు' క్రమంగా పరిణతి చెందిన వైనాన్ని మనం గమనించొచ్చు.
(నవంబరు 9 : కారా మాస్టారి జయంతి)
- ఆచార్య వెలమల సిమ్మన్న
94406 41617










