Feb 08,2023 11:10
  • ఆదాయం రూ.599 కోట్లు,
  • వ్యయం రూ.593 కోట్లు
  • రోజుకు అప్పు రూ.202 కోట్లు,
  • వడ్డీ చెల్లింపులు రూ.63 కోట్లు
  • డిసెంబరు వరకు కాగ్‌ తేల్చిన గణాంకాలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్ర ఖజానా రోజువారీ భారంతో అల్లాడుతోంది. ఆదాయం, వ్యయం, అప్పులు, వడ్డీ... ఇలా అన్ని రంగాల్లో గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కాగ్‌ వెల్లడించిన లెక్కల మేరకు ఆదాయ వ్యయాలు సమానంగా కనిపిస్తుండగా, రుణాలు, వాటిపై చెల్లించాల్సిన వడ్డీల భారం అధికంగా కనిపిస్తోంది. అలాగే వ్యయ విభాగంలో రెవెన్యూ వ్యయం కన్నా పెట్టుబడి వ్యయం నామమాత్రంగానే ఉన్నట్లు తేలింది. రుణాలు కూడా ఏడాది మొత్తానికి ఉన్న పరిమితిని కేవలం తొమ్మిది నెలల్లోనే దాటిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి.
                  తొమ్మిది నెలల్లో (మూడు త్రైమాసికాలు కలిపి) ఆదాయం రూ.1,64,641 కోట్లుగా తేలింది. ఇందులో సొంత ఆదాయం రూ.79,506 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం గమనిస్తే నెలకు సగటున రూ.18,293 కోట్లుగా ఉండగా, రోజువారీ ఆదాయం సగటున రూ.599 కోట్లుగా ఉంది. ఖర్చు మొత్తం రూ.1,63,047 కోట్లుగా నమోదుకాగా, రోజువారీ వ్యయం రూ.593 కోట్లుగా తేలింది. అంటే ఆదాయ, వ్యయాలు దాదాపు సమానంగానే ఉండటం విశేషం. కీలకమైన రుణ విభాగాన్ని పరిశీలిస్తే మొత్తం ఏడాదికి రూ.48,724 కోట్లుగా బడ్జెట్‌లో ప్రతిపాదిరచగా, తొమ్మిది నెలల్లోనే రూ.55,555 కోట్లకు రుణాలు చేరిపోయాయి. అంటే లక్ష్యం కన్నా అప్పుడే 114 శాతం అధికంగా రుణాలు తీసుకున్నట్లు తేలింది. ఈ రుణాలు నెలకు సగటున రూ.6,173 కోట్లుగా ఉండగా, రోజుకు రూ.202 కోట్లుగా లెక్కలు తేలాయి. ఈ రోజువారీ మొత్తం రుణం రోజువారీ సొంత ఆదాయానికి దరిదాపుల్లో ఉండటం గమనార్హం.
 

                                                                             పెనుభారంగా వడ్డీ

తీసుకున్న రుణాలకు చెల్లించే వడ్డీ ఖజానాకు పెనుభారంగా మారుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.17,507 కోట్ల వరకు వడ్డీ చెల్లించినట్లు నివేదికలో పేర్కొన్నారు. అంటే ఒక్క వడ్డీలకే రోజుకు రూ.63 కోట్లు చెల్లిస్తున్నట్లు తేలింది. గతేడాదికన్నా ఈ ఏడాది రూ.2,300 కోట్ల వరకు వడ్డీకి అదనంగా ఖర్చు జరిగింది.

                                                                                  లోటుపోటే

తొలి తొమ్మిది నెలలకు లోటు భారీగా నమోదైంది. ఆదాయ లోటు 17,036 కోట్లుగా అంచనా వేయగా, అది 276 శాతంతో రూ.47 వేల కోట్లు దాటిపోయింది. ద్రవ్యలోటు కూడా రూ.48,724 కోట్లుగా బడ్జెట్‌లో ప్రతిపాదించగా, ప్రస్తుతం రూ.55,555 కోట్లకు చేరిపోయింది. ఇది అంచనా కన్నా 114 శాతం అధికం కావడం గమనార్హం.