''ఎవని కంపు వాని కెంతైనా ఇంపౌను
ఎదుటి వాని కంపు ఏవగింపు
మతము గూడ పెద్ద మలినంబు కంపురా
కంపునందు చిక్కి కలత పడకు''
అచ్చ తెలుగు భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో మతమౌఢ్యాన్ని తెగేసి చెప్పిన పద్యమిది. ఒక్క మత చాంధసమే కాదు. వర్తమాన రాజకీయం, రైతు దుస్థితిని పేదకూలి దీనగాథను, వివక్షతకి గురవుతున్న స్త్రీ వేదనని, నిమ్న వర్గాలకి దూరమవుతున్న న్యాయాన్ని, మనసులు అలవర్చుకోవాల్సిన మానవీయ నీతిని పద్యాల రూపంలో తూర్పార పట్టిన పద్య కవితా కృతి ''నగ భారతం''. సమాజంలో వర్తమాన వికృతాలను నిరసిస్తూ బాధిత వర్గానికి బాసటగా నిలిచిన సాహితీ దీపికిది. 200 ఆటవెలది, సీస పద్యాల సమాహారం ఈ నగ భారతం. పద్య రచనే ఐనప్పటికీ ఎక్కడా సంస్కృత పద ప్రయోగాల్లేకుండా చక్కగా తేట తెలుగులో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో కర్షకుడు పండించిన అక్షర సేద్యమిది.
కవి తూర్పుగోదావరి జిల్లా కడియం నివాసి చిలుకూరి వెంకట్రావు. చదువుకున్నది ఆరవ తరగతి. వృత్తి వ్యవసాయం. తన స్వీయానుభవం, సమాజంలో జరుగుతున్న అసహజ పోకడలను ఎద్దేవా చేస్తూ, వాటిని ఎండగడుతూ హలదారుడు రాసిన పద్యాల కృతిది.
వర్తమాన సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలపై అక్షర శరాలతో చేసిన యుద్ధం 'నగ భారతం'. కవి రాజీలేని తత్వం, ముక్కుసూటి విధానం, చెప్పదలుచుకున్నది నర్మగర్భంగా చెప్పిన తీరు అమోఘం. పండితులు గరికపాటి నరసింహారావు, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ప్రముఖ సినీ, నాటక కళాకారుడు తనికెళ్ళ భరణి తదితరులు ఈ నగ భారతం పుస్తకానికి ముందుమాట చేర్చడంతో పాటు పద్యకవితా తీరుని, కవిని వేనోళ్ళ పొగిడి 'సచేల వేమన'ని బిరుదిచ్చారు. సాహిత్యమంతా అభ్యుదయ అడుగుల్లోనే నడిచినా యథార్థాలను సాంప్రదాయ కవులు సైతం శభాష్ అని కీర్తించటం మరో విశేషం. 'నగ భారతం' కృతి తొలి ఆవిష్కరణ 2001లో జరిగింది. 2004 మలిదశ ముద్రణలతో మరోసారి ఆవిష్కరణ జరిగింది. మానవత్వం, హేతుబద్ధం, ప్రశ్నించే తత్వం, సమానత్వం వంటి భావనలు కేవలం రచనలోనే కాకుండా, తన జీవితంలో కూడా ఆచరించి చూపిన ఆదర్శ మూర్తి చిలుకూరి వెంకట్రావు. పేదల పట్ల ప్రేమ కురిపిస్తూ, ఉన్నదాంట్లో సాయం చేస్తూ ... చివరి శ్వాస వరకూ గోచిపాత మాత్రమే ధరించిన నిడారంబరుడాయన. ఈనెల 22న ఆయన 15వ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన నగ భారతాన్ని ఒకసారి దర్శిద్దాం !
''రౌడీయిజం గూడా రాజకీయమునకు
మంచి వన్నె దెచ్చు మాట నిజము
గాడ్సే బతికి యున్న కాడా గవర్నరు?
విలువ లేమి గలవు వీరిలోన?''
ఇంత మృదువుగా వాయించడం వీరి బాణి. ఈనాటి రాజకీయ పరిస్థితికి ఈ పద్యం అచ్చంగా అద్దం పడుతోంది. ఈయన నాయకుల్ని నిందించడంతో ఆగలేదు. ప్రజల్ని కూడా కళ్ళు తెరవండంటూ అదే మోతాదులో హెచ్చరించారు.
''భావి నెరగవోయి భరత పుత్రుడ!
ఓట్ల నమ్ముకోకు పాట్లు పడకు
ఓట్ల పండుగలకు ఒడలెల్ల మత్తెక్క
చుక్కమందు చేత చిక్క బోకు''
రెండో ఖండిక నీతి. 'వినుడు చేయుచుంటి విన్నపములు' అనే మకుటంతో ఇందులో పద్యాలు సాగాయి. ఇందులోనీ కవి హాస్యాన్ని అంచుకుపూసిన కత్తివేట్లున్నాయి.
''ఎన్ని యున్ననేమి తిన్నది అరుగదు
కోట్లు పెరుగు కొలది కునుకు రాదు
డబ్బు పోగుసేత డాక్టర్ల కోసమే''
***
ఎంత జ్ఞాని అయితే నేమి? ''ఎదుటనున్న వాని ఎదలోని దెరుగడు''. ఇలాంటి సూక్తులు, ఉద్ధరించదగిన పంతులు.. ఈ ఖండికలో చాలా ఉన్నాయి. మానవ స్వభావాన్ని ఈయన బాగా అర్థం చేసుకున్నారు. ఆశలు ఒకదానిమీద ఒకటి ఎలా దొంతరలుగా లేస్తాయో గమనించారు.
''కూడు దొరికెనేని గూడుకై ఏడ్చును
గూడు కూడెనేని మేడ గోరు
మేడలోన కులికి మేటి పదవి గోరు''
తర్వాత ఖండికలో పేదకూలీని కవిత వస్తువు చేసి కవిత్వానికి పరిపుష్టి కలిగించాడు. ఈ ఖండికలో కవి తాలూకు ఆత్మీయత ప్రతి అక్షరంలో కనబడుతుంది. 'కూలివాని బతుకు జాలి గొలుపు' మకుటంతో శ్రమ జీవన సౌందర్యాన్ని, శ్రమజీవుల కడుపుకోతలు వర్ణన అక్షరాక్షరము కవికి ప్రతిబింబమే !
''బ్రతికినన్ని నాళ్ళు బండ చాకిరి తప్ప
కూలివాని కెపుడు కుదురు లేదు
కాటి కేగు వరకు కష్టాలు తప్పవు''
అసంఘటిత కార్మికుల వార్ధక్యం దుర్భరాన్ని ఈ పద్యంలో కవి కళ్ళకు కట్టినట్టు చెప్పారు. ముసలితనంలో రెక్కాడదు అలాగని డొక్కాగదు. ఈ కోణం పాఠకుల్ని ఆలోచింపజేస్తుంది. ఈ ఖండికలో
కార్మికులు ఎలా దోపిడీ గురవుతారో ఈ కవి గుర్తించి కుండ బద్దలు కొట్టారు.
''భరతమాత కన్న బంగారు కూలన్న!
తీర్చు చుంటి నీవు దేశ ఋణము
చేయు చుంటి నీకు జేజేలు- అందుకో
ధన్య జీవివయ్యా!- దండమిదిగో''
ఈ కవి రైతు గనకే రైతు త్యాగాన్ని ఇంతిలా వివరించ గలిగాడు. అటు పైది రైతు ఖండిక. 'అన్నదాత బతుకు మన్నుపాలు' అనేది మకుటం.
''పాడు పడిన భూమి పసిడిగా మార్చంగ
ధనలక్ష్మి కొరకు దారి చూప
రైతు వలన తప్ప రాజు చేత నగునే?''
''బ్లేడు చేయువాడే వెలకట్టు దానికి
సోడ బుడ్డి రేట్లు వాడే చెప్పు
పంట రైతుదైన పైవాడు ధర కట్టు''
''బంతి ఆట కిచ్చు బంగారు కప్పులు
బొమ్మలాట కిచ్చు సొమ్ములెన్నో
పంట పండ జేయ బహుమాన మున్నదా?'' వంటి పద్యాలు రైతుల ఔన్నత్యం, కష్టాల గురించి వారి పట్ల ప్రభుత్వాల ఉదాసీన వైఖరి గురించి ఇందులో కవి చాలా ముక్కు సూటిగా చెప్పాడు. ఆటవెలది పద్యాలతో ఎంత అందంగా ఆడుకోవచ్చో యీ 'నగ భారతం'లో కవి వెంకట్రావు పద్యాలతో అంత సమర్థవంతంగా ఆడుకున్నారని గరికపాటి వారు ముందుమాటలో పేర్కొన్నారు.
న్యాయం మరో ఖండిక. సాధారణంగా ఎంతటి వారైనా?! న్యాయవ్యవస్థ మీద బాణాలు గురిపెట్టడానికి జంకుతారు. ఏ మూల నుంచి ఏది కోర్టు ధిక్కారమవుతుందోనని... వెంకట్రావుకేముంది? గోచిపాతరాయుడు. 'న్యాయమెచట దొరుకు నరుడ! నీకు' అనే మకుటంతో పేల్చి పడేశాడు.
''కళ్ళు లేని కోర్టు కానలేదు నిజము
చెప్పు వాని బట్టి చేయు తీర్పు
చివరికి గెలిచేది చెప్పించు కొనువాడే''
''ఉన్న దొకటే చట్టమెన్నియో కోర్టులు
తీర్పు కోర్టును బట్టి మార్పు జెందు
తప్పు జేయువాడు తప్పించుకొనుటకే''
ఇవి నేటి వాస్తవ పరిస్థితికి అద్దం పట్టే కొన్ని ఆణిముత్య పద్యాలు.
''స్త్రీని అర్ధనగ శృంగార మూర్తిగా
బొమ్మ వేసి సరుకులు అమ్ముకొంద్రు
బ్లేడు కట్ట పైన ఆడ బొమ్మెందుకు?
స్త్రీల గొప్పదనం తెలుసి కొనుము'' అంటూ ఆడవాళ్ళని కార్పొరేట్ వ్యాపారాల్లో అర్ధ నగంగా ప్రచారానికి ఉపయోగించుకుంటున్న తీరుపై కవి నిప్పులు చెరిగాడు.
''కొడుకు కొరకు తల్లి కోటి పూజలు చేయు
ఆడుబిడ్డ పుట్ట అదిరిపడు
అమ్మకైన గాని ఆడదంటే అలుసు
స్త్రీల గొప్పదనం తెలుసి కొనుము''
మహిళలకే ఆడవారి పట్ల సానుభూతి లేకపోతే ఎలా? అంటూ ఈ పద్యంలో కవి అమ్మలను నిలదీశాడు. ఆడబిడ్డలను అక్కున చేర్చుకోమని మాతృమూర్తులకు హితోపదేశం చేశాడు.
''అవనికి వెలుగు జిలుగు ఆడది
ప్రేమించు అమృత హృదయం ఆమెది
పూజించకు ఆమెను రాతి బొమ్మ వలెను
నిండు గౌరమివ్వా అనంత త్యాగనిధికి''
మహిళా మూర్తిని వంటింటి కుందేలు చేసి, రాతి బొమ్మని చేసి, పూజించుటకంటే ఆమెకు మగవారితో సమాన విలువల్ని ఇవ్వటం కంటే మించిన గౌరవం లేదంటాడు కవి. కవి చిలుకూరి చదువుకున్నది ప్రాథమిక విద్యే అయినా మానవతా విలువలు, మానవ హక్కులు, సమానత్వం తెలిసిన సమ సమాజవాది. అంతకుమించి మహిళా పక్షపాతి అందుకే మహిళాభ్యుదయానికి సంబంధించిన లోతైన విషయాలు స్పష్టంగా రాయగలిగాడు. ఈ కృతిని తన భార్య లక్ష్మికి అంకితమిచ్చారు.
''నగ భారతాన్ని చదివా.... లేదు, చూశా! దర్శించా.... పులకించా! కడుపు రగిలింది. గుండె మండింది. కన్ను చెమ్మగిల్లింది- చాలు! కవి ధన్యుడు. కవిత్వం సజీవం'' అని పేర్కొన్నారు తనికెళ్ల భరణి. ''చదవండి! రాసిన కవి కన్నా! మీరంతా చదువుకున్నవారే! కాకపోతే కాస్త ధైర్యంగా చదవండి. ఏ పద్యంలోనైనా చటుకుక్కన మీకు మీరు కనపడవచ్చు. కంగారు పడకండి. కలత చెందారో- మంచిదే! కవి కోరిక నెరవేరుతుంది.'' అని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం సమీక్షలో పేర్కొన్నారు. గరికపాటి 'ఇది శతకం కాదు. అయినా శతక లక్షణాలు గల మంచి పతకం''. అన్నారు.
మట్టి చేతులు సృష్టించిన గట్టి కావ్యాన్ని మనమంతా మనసు పట్టి చదువుదాం. మంచిని తట్టి చాటిన కవికి నీరాజనాలు పలుకుదాం.
(ఈనెల 22 : చిలుకూరి వెంకట్రావు 15వ వర్ధంతి)
- చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506










