Sep 19,2022 20:32

 'ప్రజాశక్తి'తో డివైఎఫ్‌ఐ అఖిల భారత ఉపాధ్యక్షులు జెసి.థామస్‌
ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : 
'సామాన్య వర్గాల గురించి ప్రధాని మోడీకి అసలు పట్టడం లేదు. దేశ యువతకు ఉద్యోగాల కల్పన హామీకే పరిమితమైంది' అని డివైఎఫ్‌ఐ అఖిల భారత ఉపాధ్యక్షులు జెసి థామస్‌ పేర్కొన్నారు. డివైఎఫ్‌ఐ రాష్ట్ర 15వ మహాసభ సందర్భంగా కర్నూలుకు వచ్చిన ఆయన 'ప్రజాశక్తి'తో మాట్లాడారు.
దేశంలో నిరుద్యోగం పరిస్థితి ఎలా ఉంది ?
థామస్‌ :
దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెరిగిపోతోంది. జిడిపి వృద్ధి అవుతోందని గోడీ మీడియా ప్రచారం చేస్తోంది. దేశంలో జరిగిన వృద్ధి అదానీ, అంబానీ లాంటి శత కోటీశ్వరులకే పరిమితమైంది. సామాన్య ప్రజలకు, యువతకు అభివృద్ధి ఫలాలు అందడం లేదు. సాయినాథ్‌ లాంటి విశ్లేషకులు దీన్ని జాబ్‌ లెస్‌ గ్రోత్‌గా విశ్లేషించారు.
డివైఎఫ్‌ఐగా ప్రధానంగా ఏయే వాటిపై పోరాటాలు సాగించారు?
థామస్‌ :
కలకత్తా మహాసభ తరువాత నిరుద్యోగం మీద పోరాడాలని అఖిల భారత కమిటీ పిలుపునిచ్చింది. వేర్‌ ఈజ్‌ మై జాబ్‌ (నా ఉద్యోగం ఎక్కడ) పేరుతో ఢిల్లీలో ఆందోళనలు చేపట్టాం. కేంద్రం తీసుకున్న అగ్నిపథ్‌ నిర్ణయంపై జాతీయ స్థాయిలో పోరాటాలు సాగించాం.
యువతపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది ?
థామస్‌ :
కేంద్ర ప్రభుత్వానికి సామాన్య వర్గాల సమస్యలు అసలు పట్టడం లేదు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఆగ్రాలో మోడీ హామీ ఇచ్చారు. అది హామీకే పరిమితమైంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఉద్యోగాలుపోయి నిరుద్యోగం భారీగా పెరిగింది.
డివైఎఫ్‌ఐ భవిష్యత్తు పోరాటాలు ఎలా ఉండబోతున్నాయి?
థామస్‌ :
వేర్‌ ఈజ్‌ మై జాబ్‌ (నా ఉద్యోగం ఎక్కడ) పేరుతో ఆందోళనలు కొనసాగిస్తాం. ఈ నెల 25న రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు సాగుతాయి. నవంబర్‌ మూడున జాతీయ స్థాయిలో ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించి ఉద్యోగాల కోసం పోరాడుతాం.
కేరళ ప్రభుత్వం ఆదర్శవంతంగా మారింది కదా. అక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది?
థామస్‌
: కరోనా సమయంలో ఆక్సిజన్‌లేక దేశంలో ఎంతోమంది చనిపోయినా, కేరళలో మాత్రం ఆక్సిజన్‌ కొరత లేకుండా ఆ ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంది. ఆక్సిజన్‌ లేక కరోనా రోగి మరణించిన ఘటన కేరళలో ఒక్కటీ లేదు. కరోనా సమయంలో పేదలకు ఆహార పంపిణీ, వైద్యం వంటి వాటిలోనూ ఆదర్శంగా నిలిచింది. దేశం మొత్తం ప్రయివేటీకరణ అవుతుంటే, కేరళలో ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 44 సహకార సంస్థలు నడుస్తున్నాయి. కేరళ ఇప్పుడు ఆలోచించినట్లు రేపు భారత్‌ ఆలోచించాలి.