Feb 05,2023 21:30

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు కేంద్ర ప్రభుత్వం చెల్లించే కరవు భత్యాన్ని నాలుగు శాతం మేర పెంచే అవకాశం ఉంది. దీంతో మూల వేతనంలో డీఏ ప్రస్తుతం ఉన్న 38 శాతం నుంచి 42 శాతానికి పెరగనుంది. ఈ విషయమై ఆల్‌ ఇండియా రైల్వేమెన్‌ ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ శివ గోపాల్‌ మిశ్ర ఓ వార్తాసంస్థతో మాట్లాడారు. 'గతేడాది డిసెంబరుకు సంబంధించిన 'పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా డీఏ నాలుగు శాతం పెరిగి 42 శాతానికి చేరుకునే అవకాశం ఉంది' అని చెప్పారు. ఆర్థిక శాఖ ఈ మేరకు డీఏ పెంపు ప్రతిపాదనను కేంద్ర కేబినెట్‌ ముందు ఉంచనుందని తెలిపారు.ఒకవేళ ఈ ప్రతిపాదనను కేంద్రం ఆమోదిస్తే.. తాజా డీఏ పెంపు జనవరి 1, 2023 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 38 శాతం కరవు భత్యం పొందుతున్నారు. డీఏలో చివరి సవరణ సెప్టెంబర్‌ 28, 2022న జరిగింది. ఇది జులై 1, 2022 నుంచి అమల్లోకి వచ్చింది. ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కేంద్రం సవరిస్తూ ఉంటుంది. పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ అందజేస్తారు.