Oct 14,2023 10:09

- మ.2.00గం||ల నుంచి
అహ్మదాబాద్‌: భారత్‌, పాకిస్తాన్‌ జట్ల మధ్య నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. ప్రపంచంలోని అతిపెద్ద మైదానాల్లో ఒకటైన ఈ స్టేడియంలో శనివారం జరిగే మ్యాచ్‌కు సంబంధించి ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ మ్యాచ్‌ను ఎప్పుడెప్పుడు వీక్షిస్తామా? అని యావత్‌ ప్రపంచ క్రీడాభిమానులంతా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. పాకిస్తాన్‌ జట్టు ఏడేళ్ల తర్వాత భారత్‌లో క్రికెట్‌ మ్యాచ్‌ ఆడేందుకు అడుగుపెట్టింది. ఇక వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు అద్భుతమైన ట్రాక్‌ రికార్డు ఉంది. వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా.. పాకిస్తాన్‌ చేతిలో ఓడిన దాఖలాలు లేవు. వన్డే ప్రపంచకప్‌లో ఇరుజట్లు ఇప్పటివరకు ఏడుసార్లు తలపడగా.. అన్నిట్లోనూ భారత్‌ జయకేతనం ఎగురవేసింది. అదే రికార్డును ఇక్కడా కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది. ఇక వన్డే వరల్డ్‌కప్‌-2023లో భారత్‌, పాకిస్తాన్‌ జట్లు ఆడిన తొలి రెండు లీగ్‌ మ్యాచుల్లో గెలుపొందడంతో ఈ మ్యాచ్‌పై క్రీడాభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. పాకిస్తాన్‌ జట్టు నెదర్లాండ్స్‌పై చెమటోడ్చి నెగ్గినా.. రెండో లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకపై 345పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌ ప్రాధాన్యత సంతరించుకోగా.. అభిమానుల్లో ఏ జట్టు గెలుస్తుందా? అనే టెన్షన్‌ నెలకొంది.
శుభ్‌మన్‌కు చోటు దక్కేనా..?
డెంగీ కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన టీమిండియా ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ కోలుకున్నాడు. గురువారం నుంచే నెట్స్‌లో ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. 100% ఫిట్‌నెట్‌ సాధిస్తేనే అతడికి తుదిజట్టులో చోటు దక్కనుంది. అదే జరిగితే ఇషాన్‌ కిషన్‌ స్థానాన్ని అతడు భర్తీ చేస్తాడు. శుభ్‌మన్‌ గిల్‌ పూర్తిగా కోలుకున్నట్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ శుక్రవారం ధ్రువీకరించాడు. మ్యాచ్‌ ఆడేందుకు ఫిట్‌గా ఉన్నాడని, అతడిని పాక్‌తో మ్యాచ్‌లో ఆడించాలా? లేదా? అన్నది మ్యాచ్‌కు ముందు నిర్ణయిస్తామని పేర్కొన్నాడు. అహ్మదాబాద్‌లో అద్భుతమైన రికార్డు ఉన్న గిల్‌ను ఆడిస్తారో.. లేక ఆసియా వన్డే కప్‌-2023లో పాకిస్తాన్‌పై 82 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌ రాణించిన కిషాన్‌ వైపు మొగ్గుచూపుతారో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
మొత్తం ప్రపంచకప్‌లలో ఇరుజట్ల రికార్డు..
భారత్‌ పాకిస్తాన్‌
ఆడినవి 86 81
గెలుపు 55 47
ఓటమి 29 32
టై 1 0
ఫలితం రానివి 1 2
గెలుపుశాతం 65.29 59.49
జట్లు(అంచనా)..
భారత్‌: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), కెఎల్‌ రాహుల్‌(వికెట్‌ కీపర్‌), ఇషాన్‌/శుబ్‌మన్‌, శ్రేయస్‌, కోహ్లి, హార్దిక్‌, జడేజా, శ్రేయస్‌, కుల్దీప్‌, బుమ్రా, సిరాజ్‌.
పాకిస్తాన్‌: బాబర్‌(కెప్టెన్‌), రిజ్వాన్‌(వికెట్‌ కీపర్‌), షౌద్‌ షకీల్‌, ఫకర్‌ జమాన్‌, ఇప్తికార్‌ అహ్మద్‌, షాదాబ్‌ ఖాన్‌, మహ్మద్‌ నవాజ్‌, హసన్‌ అలీ, షాహిన్‌షా అఫ్రిది, రవూఫ్‌, ఇమామ్‌-ఉల్‌-హక్‌/అబ్దుల్లా షఫీక్‌,