Feb 25,2023 10:09
  • బిసి కార్పొరేషన్లకు రూ.12 వేలకోట్లకు పైనే
  • ప్రతిపాదనలు సిద్ధం చేసిన సంక్షేమ శాఖ

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఎన్నికల బడ్జెట్‌గా పరిణమిస్తున్న వేళ అనేక సంక్షేమ కార్యక్రమాలకు భారీగా నిధులను కోత విధిస్తున్నారు. ఈ మేరకు సంక్షేమశాఖ అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌కు వారు చేస్తున్న ప్రతిపాదనలు ఇదే రుజువుచేస్తున్నాయి. ఒక్క ఆసరా పథకానికి తప్ప మిగిలిన వాటిల్లో భారీగానే కత్తిరింపులు ఉన్నట్లు తెలుస్తోంది. బిసి సంక్షేమానికి మొత్తం రూ.24,931 కోట్లు బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్న ఆ శాఖ... ఇతర శాఖల వ్యయంతోపాటు మొత్తం వ్యయం రూ.40 వేలకోట్లు దాటిపోతుందనే భావాన్ని వ్యక్తం చేస్తుండడం విశేషం.
        తాజా ప్రతిపాదనలు చూస్తే సంక్షేమ వ్యయం భారీగా తగ్గే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఎన్నికల వేళ సంక్షేమానికి మరిరత పెద్దపీట వేస్తారని అంతా భావించగా, నిధుల కేటాయింపు ప్రతిపాదనల్లో మాత్రం కత్తిరింపులు నెలకొనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికే పథకాలకు, జీతభత్యాలకు నిధులు చాలడం లేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిధుల కేటాయింపుల్లో కోతలు నెలకొంటుండడం కూడా చర్చనీయాంశం అవుతోంది. బడ్జెట్‌ భారీగానే కనిపిస్తున్నప్పటికీ, గతేడాదితో పోల్చి చూస్తే గణనీయంగా నిధులు తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. గతేడాది పెన్షన్‌ కానుక కింద రూ.18 వేలకోట్లు కేటాయించగా, ఈసారి మాత్రం రూ.9,732 కోట్లు మాత్రమే ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. అలాగే వసతి దీవెనకు గతేడాది రూ.2,083 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది కేవలం రూ.1,062 కోట్లకే పరిమితమవుతున్నట్లు తెలుస్తోంది. వైఎస్‌ఆర్‌ చేయూత, విద్యా దీవెన, చేదోడు, వాహన మిత్ర వంటి అనేక పథకాలకు కూడా కోతలు తప్పవన్న భావన వ్యక్తమవుతోంది. అయితే వైఎస్‌ఆర్‌ ఆసరా పథకానికి మాత్రం ఊహించని విధంగా భారీ నిధులు కేటాయింపులు చేయనున్నట్లు తెలుస్తోంది. గతేడాది రూ.6,400 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది ఏకంగా రూ.30 వేల కోట్లుకు పైగా కేటాయింపులు ఉండనున్నట్లు తేలింది. ఇంత భారీగా ఎందుకు ప్రతిపాదిస్తున్నారన్నది తేలడం లేదు.
 

                                                                         కార్పొరేషన్లకు భారీగా..

ఇక వివిధ కార్పొరేషన్లకు మాత్రం నిధులు భారీగా కేటాయింపులు ఉండనున్నాయి. తాజా ప్రతిపాదనల్లో బిసి కార్పొరేషన్‌కు వేల కోట్లు నిధులు కేటాయించనున్నారు. బిసి కార్పొరేషన్ల ద్వారా ఎ-కేటగిరికి రూ.3,864 కోట్లు, బి-కేటగిరికి రూ.3,502 కోట్లు, డి-కేటగిరికి రూ.4,022 కోట్లు, ఇ-కేటగిరికి రూ.997 కోట్లు కేటాయింపులు చేయనున్నారు. సంక్షేమ శాఖలకు విధించిన కోతలను కార్పొరేషన్లకు కేటాయించిన నిధులతో కొంతవరకు భర్తీ చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది.

111