Nov 17,2022 22:11

-గతేడాదితో పోల్చితే 13 శాతం కుదింపు
హైదరాబాద్‌ : కార్పొరేట్లకు రూ.వేల కోట్ల రుణాలను అప్పనంగా ఇచ్చే బ్యాంక్‌లు విద్యార్థుల చదువులకు మాత్రం రుణాలివ్వడానికి వెనకాడుతున్నాయి. గతేడాదితో పోల్చితే ఈ విభాగం రుణాల మంజూరులో 13.5 శాతం కోత పెట్టాలని ప్రభుత్వ రంగ బ్యాంక్‌ (పిఎస్‌బి) నిర్ణయించాయని తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో 12 పిఎస్‌బిలు మొత్తంగా రూ.23,640 కోట్ల విద్యా రుణాలు అందించగా.. వీటిని ప్రస్తుత 2022-23లో రూ.20,450 కోట్ల రుణాలకు పరిమితం చేయాలని బ్యాంక్‌లు లక్ష్యంగా పెట్టుకున్నాయని ఓ ఆంగ్ల పత్రిక రిపోర్టు చేసింది. దేశంలో మొత్తం విద్యా రుణాలలో దాదాపు 90 శాతం పిఎస్‌బిలే ఇస్తున్నాయి. సామాజిక బాధ్యత కొరవడిన ప్రయివేటు రంగ బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిల వాటా 10 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. విద్యా రుణాల మంజూరులో బ్యాంకులు నిర్దేశించుకున్న లక్ష్యం కూడా చాలా నెమ్మదిగా సాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర లక్ష్యంలో జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి కేవలం 19 శాతం లక్ష్యాన్ని మాత్రమే చేరాయి. రూ.7.5 లక్షల కంటే తక్కువ పరిమాణ రుణాల మంజూరులో బ్యాంకులు మరింత కఠిన నిబంధనలు అమల్జేస్తున్నాయి. ఈ రుణాలు ఎక్కువగా నిరర్థక ఆస్తులుగా మారుతున్నాయని సాకుగా పేర్కొంటున్నాయి. దేశీయంగానూ టెక్నికల్‌ కోర్సులకు వ్యయం భారీగా పెరిగిన నేపథ్యంలో విదేశీ విద్యకు భారీగా డిమాండ్‌ పెరిగింది. దీంతో అనేక మంది మధ్య తరగతి కుటుంబాలు విద్యా రుణాలపై ఆధారపడుతున్నాయి. కానీ బ్యాంక్‌లు వారిని నిరాశకు గురి చేస్తున్నాయి. విద్యా రుణాల తగ్గుదలపై విద్యా నిపుణులూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.