మనకు తెలిసిన ప్రపంచం ఒకటుంటుంది. తెలియని ప్రపంచం ఒకటి ఉంటుంది .తెలిసి తెలియని ప్రపంచం ఒకటి ఉంటుంది. కథకుల్లో కొందరు తెలియని ప్రపంచం గురించి తెలిసేలా రాస్తారు .కొందరు కథకులు తెలిసిన ప్రపంచం గురించే భిన్నంగా రాస్తారు. ఏ రచయిత అయినా తన రచన పాఠకుల హృదయాల్లో తిష్ట వేయాలని చూస్తారు. ఎంచుకున్న ఇతివృత్తాన్ని ఫలవంతంగా పాఠకుడిలోకి ప్రయాణం చేయించగలగాలి. సమస్యా పరిష్కార పద్ధతిలో కథలు రాసే కాలం కాదిది. ఆ పద్ధతిలో కథలు రాస్తే కథకి ఆయుష్షు తగ్గిపోతుంది. కథకి ఓ జీవరేఖ ఉండాలి.
చిత్తూరు జిల్లా గ్రామీణ జీవితాన్ని తన కథల ద్వారా సాహిత్య లోకానికి అందించిన రచయిత రాసాని. సంచార జాతుల బతుకులు బయట ప్రపంచానికి చూపించడంలో విజయం సాధించిన కథకుడు. ఆయన కథలో అన్వేషణ, పరిశీలన, పరిశోధన ప్రధానంగా కనిపిస్తాయి. ఆ కథలకు ఏ భాష ఇవ్వాలో రాసానికి తెలుసు. భాష కథను ప్రవహింపచేస్తుంది. ప్రసరింప చేస్తుంది. ఏకబిగిన చివరికి లాక్కెళ్ళే కాంతి కదా భాష. మాండలిక భాషను ప్రభావవంతంగా వాడి కథన సౌందర్యాన్ని ఆవిష్కరించడంలో రాసాని కృతకృత్యులయ్యారు. రాసాని కళా సూత్ర జ్ఞానం కలిగిన కథకుడు. సామాజికాభ్యుదయాన్ని ఆకాంక్షించే ఆరాటం కలిగిన మనిషి. ఆయన కథా వస్తువు కోసం తన చుట్టూనే చూస్తాడు. తన చుట్టూ ఉన్న పరిసరాలు ఆయన పరిధి .స్వతంత్ర దృక్పథంతో అప్పటిదాకా వెలుగు చూడని జీవిత కోణాలను సమాజంలోని జీవితాలను చూపిస్తూ ఈ కథకుడు ముందుకు నడుస్తున్నాడు .
రాసాని రాసిన తపస్సు కథ చిత్తూరు జిల్లా ప్రాంతానికి చెందింది. చిత్తూరులో జరిగే భారతం తిరణాలు ఉత్సవంలో జరిగే సాంప్రదాయ కళ. తపస్సమాను ఎక్కే కళాకారుడు జీవితం గురించి రాసిన కథ. ఆ కథలో ఆరోజు తపస్సుని అధిరోహించాల్సిన సిద్దుగోడు లేకపోవడంతో గతంలో ఎన్నోసార్లు ఎక్కి ఇప్పుడు వయసైపోయిన రంగప్పకి అనుకోకుండా అవకాశం వస్తుంది. రంగప్ప జీవితం గందరగోళంగా ఉంది. డబ్బు అవసరం ఉంది తపసుమాను ఎక్కితే వచ్చే సొమ్ము ద్వారా కొన్ని కష్టాలు తీరవచ్చు అనే ఆశ అతన్ని ఒప్పుకునేలా చేసింది. తపసుమాను ఇంద్రకీలాద్రి పర్వతానికి ప్రతీక. చాలా పొడవైన అశోక వృక్షాన్ని తపస్సుమానుగా నాటారు. తపస్సు మాను ఎక్కాక టెంకాయ కొట్టి ముక్కలు చేసి అరటి పండ్లు, నిమ్మకాయలు, మిఠాయిలు, బొరుగులు, విభూది అన్నీ కలిపి భక్తుల మీద చల్లుతారు. అవి దొరికిన వాళ్లకి కష్టాలు తీరుతాయని అక్కడికి విశ్వాసం. ఈ కథను రాసాని సమర్థవంతంగా నడిపాడు. తపసుమాను ఎక్కిన రంగప్ప లోపల జరిగే అంత్ణ సంఘర్షణలో కథ పాఠకుడిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.
ఈ కథ ముగింపుకు పోయే కొలది రంగప్ప చనిపోతాడేమో అనిపిస్తుంది. రచయిత చంపేస్తాడేమో అనిపిస్తుంది. కానీ రాసాని పాఠకుడి కూడా ఆలోచనని భగం చేస్తారు. రంగప్ప కిందకి దిగుతాడు. జయం పొందుతాడు. భారతానికి మొదటి పేరు జయమే కదా తపస్సు మాను దిగిన రంగప్ప మనసులో నేనిప్పుడు జయించినట్టా?ఓడిపోయినట్టా? అసలు ఎందులో జయించినట్టు ఎందులో ఓడిపోయినట్టు? అనుకుంటూ గర్వంగా నిటారుగా నిలబడి ఉన్న తపస్సుమాను వంక చూడడంతో కథ ముగుస్తుంది .
రాసాని కథల్లో పాత్రలతో పాటు పరిస్థితులు కూడా భాగమై ఉంటాయి. అవాస్తవ పరిస్థితులను ప్రచారం చేయడు. తన అనుభవ పరిధిని అతిక్రమించడు. వ్యవస్థలో నిర్లక్ష్యానికి గురవుతున్న వర్గాలపై గురి పెడతాడు. అంతర్మధనం చెందుతాడు. అదే అంతర్మధనాన్ని కథనంతో పాఠకునిలోకి పంపుతాడు. విధ్వంసం అయిపోయిన జానపద కళారూపాల చివర దశని చూసి వేదనపడతాడు. సాంస్క ృతిక వాతావరణాన్ని నిర్లక్ష్యం చేయకుండా, శ్రద్ధగా చూపుతాడు.
ఆయన కథలో మానవ సంబంధాల పతనం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కథలను చదివిన పాఠకుడు కారణాలు అన్వేషిస్తాడు. రాసాని కథల్లో మరో విశేషం శక్తివంతమైన స్త్రీ పాత్రలు. ఆ పాత్రల తాలూకు ఏ క్షణాన్ని రాసాని వ్యర్థం చేయడు. మెరవణి కథలో నరసమ్మ భర్త రంగన్న శవంమీద పడి గుండె లవిసేలా ఏడుస్తుంది. నరసమ్మ చేతికి తన భర్త రంగన్న రక్తం. ఆ రక్తాన్ని ముఖాన్ని పూసుకుంటుంది. 'వరేరు ఇప్పుడు చూడండి రా. మీ కులాలు వేరు. మా కులం వేరు. అందరి రక్తం ఒకటే అందరి కులాల్లో ఉండే రక్తము ఒకటే. అది ఎర్రగానే ఉంటాది. దాని వర్ణం ఎరుపు చూడండి'' అంటూ మనుషులంతా ఒక్కటే అనే విషయాన్ని ఎర్రగా చెబుతుంది. ఇక్కడ వాచ్యం చేస్తున్నట్టుగా ఉన్నా ఆ పాత్ర తాలూకా స్పందన నిజాయితీని కథకుడు దెబ్బతీయడు. గాలి చెట్టు కథలో ముని లక్ష్మి పురుషాధిక్యాన్ని ప్రశ్నిస్తుంది. గృహహింసను ఎదిరిస్తుంది. అక్షింతల కథలో మాతమ్మ వ్యవస్థపై భాగ్యమ్మ తిరుగుబాటు ప్రకటిస్తుంది. బరియల్ పార్కులో సుబ్బయ్య భార్య కథ నడుపుతుంది.
రాసానికి పాత్రల పట్ల అలసత్వం ఉండదు. అవి నంగి నంగిగా ప్రవర్తించవు. వాటికో ఆత్మను ఇస్తాడు. యాంత్రికమైన చిత్రణ కనిపించదు. తన చుట్టూ ఉన్న సమాజంలో జరిగే కల్లోలాన్ని కథా వస్తువుగా తీసుకుంటాడు.వాటి పరిణామాల్ని, ఫలితాలను వ్యాఖ్యానించకుండానే కథలో భాగం చేస్తాడు. వేట, పయనం, నాలుగో నాటకం కథలు రాసానే రాయగలరు. ఈ కథల్లోని వస్తువు విలక్షణమైనది. ప్రతీకాత్మక శీర్షికల ద్వారా ఈ కథకుడు కథ చెప్పేయడాన్ని గమనించవచ్చు. అదృశ్య శక్తులు మానవత్వం మీద, మానవతా విలువలు మీద జరిపే దాడిని గుర్తించమంటాడు. సామాజిక ఛట్రం ఎందుకు ఛిద్రమవుతుందో రాసాని కథలు చదవడం ద్వారా అర్థం చేసుకోవచ్చు. బరియల్ పార్క్ కథ ప్రత్యేక ఆర్థిక మండళ్లు, వాటి పర్యావసనాలకు వ్యతిరేకంగా రాసిన కథ. ఒక స్త్రీ పాత్ర కథను చెప్పుకుంటూ పోతుంది. ఆ ఆ కంఠ స్వరంలోని వేదన మనల్ని వెంటాడుతుంది. తృతీయ వర్గము అనే కథ గొప్ప శిల్పంతో పాఠకులను ఆకట్టుకుంటుంది.
సామాజిక చలనాలను రాసాని అర్థం చేసుకున్న తీరు ఈ కథలు చదవటం ద్వారా మనకు తెలుస్తుంది. చాలా అద్భుతమైన మాండలిక పదాలను ఆయన కథల్లోంచి జాబితాగా తయారు చేయొచ్చు. ఆ ప్రాంత నుడికారాన్ని, సామెతలను సమయానుకూలంగా వాడడంలో ఈయన నేర్పరి. కథలో చేసే వర్ణనలు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాయి. వాస్తవంగా ఉంటాయి. ఉదాహరణకు వేట కథలో 'కంకర రాళ్లతో బొచ్చు ఊడిపోయిన గజ్జి కుక్క చర్మంలా వికారంగా కనిపించింది రోడ్డు.' అలాగే తపస్సుమాను కథలో 'భారతం మెట్ట నడిబొడ్డున పొడవుగా బ్రహ్మ రాక్షసి కళేబరంలా పడి ఉంది, కొమ్మలు లేని ఒక అశోక వృక్షం.' నాలుగో నాటకం కథలో 'అక్కడి నుంచి ప్రారంభమైన అడవికి నాయకత్వం వహిస్తున్నట్లు ఆకాశంలో నిటారుగా నిలబడి గంభీరంగా కనిపిస్తుంది చింతచెట్టు.... ఇలా ఆ కథ ఏమి ఆశిస్తోంది అనేది అలవోకగా తీసుకురాగలిగే నైపుణ్యం ఈ కథకుడికి అదనపు బలం. కథకు ఏమి ఇవ్వాలో, ఏమి ఇవ్వకూడదో తెలిసిన కథకుడు రాసాని. ఆయనకు కొత్తగా చెప్పాల్సింది ఏముంటుంది?
- డాక్టర్ సుంకర గోపాలయ్య
94926 38547










