Feb 23,2023 09:10
  •  భూ పంపిణీలో సాగదారులకు అన్యాయం
  •  ప్రజాప్రతినిధులు చెప్పిన వారికే పట్టాలు
  •  ఏళ్లతరబడి సాగులో ఉన్నా ప్రయోజనం శూన్యం

ప్రజాశక్తి-బొమ్మనహాల్‌ (అనంతపురం) : ఏళ్ల తరబడి సాగులో ఉన్న పేద రైతులు భూమి పట్టాల కోసం వేచి చూస్తున్నారు. ఎప్పుడో ఒకసారి పట్టా వస్తుందని గంపెడు ఆశతో ఉన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చారు. అయినా నేటికీ వారికి సాగు పట్టాలు చేతికందలేదు. ఈ సారి ప్రభుత్వం నిర్వహిస్తున్న భూ పంపిణీలో అయినా తమకు న్యాయం జరుగుతుందని రైతులు అధికారులకు అర్జీలను ఇచ్చారు. అయితే ఇక్కడ కూడా సాగుదారులకు అన్యాయం జరుగుతోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అనంతపురం జిల్లా బొమ్మనహాల్‌ మండలంలో ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. మండలంలోని 15 రెవెన్యూ గ్రామాల పరిధిలో భూ పంపిణీ మొదటి విడత పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఎంపిక చేసిన గ్రామాల్లో భూములకు సంబంధించి సాగులో ఉన్న రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేలా అధికారులు రైతుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఇక్కడే కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు అవినీతికి తెరలేపినట్లు తెలుస్తోంది. సాగుచేస్తున్న వారిని కాకుండా అనర్హులను జాబితాలో చేరుస్తున్నట్లు సమాచారం. ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నేతలకు అవసరమైన వారి బంధువులు, స్నేహితుల నుంచి మాత్రమే అర్జీలను సేకరించి పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి తెరలేపారు. ఏళ్ల తరబడి సాగులో ఉన్న అర్హులైన వారు పట్టాలు పొందాలన్నా సంబంధిత నాయకులు, అధికారులకు డబ్బులు చెల్లించక తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. ఇలా ఒక్కో రైతు ద్వారా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
బొమ్మనహాల్‌ మండల పరిధిలోని నేమకల్‌ గ్రామం 85 సర్వేనెంబర్‌లో 282 ఎకరాలు అసైన్డ్‌ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భూమి పంపిణీ నిమిత్తం రైతుల నుంచి 142 అర్జీలు వచ్చాయి. అర్జీలు ఇచ్చిన వారిలో భూమి సాగు చేస్తున్న రైతులు కేవలం 24 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన వారు ఎవరో కూడా తెలియని పరిస్థితి ఉంది. శ్రీధరగట్ట గ్రామం సర్వేనెంబర్‌ 265లో 27 ఎకరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కళ్లుదేవనహళ్లి గ్రామంలోనూ అసైన్డ్‌ భూమిని గుర్తించి దీని పంపిణీ నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. మండల వ్యాప్తంగా సుమారు 5000 మంది చిన్న, సన్నకారు రైతులు సాగుభూముల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరందరికీ పట్టాలు ఇవ్వాల్సిన అధికారులు వారి అర్జీలను పక్కన బెట్టి సిఫార్సులు, డబ్బులు ఇచ్చిన వారికే భూ పంపిణీలో పేర్లు చేరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే పరిస్థితి మండలంలోని గోవిందవాడ, బొల్లనగుడ్డం, సింగానపల్లి, బండూరు, అరేసముద్రం, కురవల్లి, ఉద్దేహాల్‌, దర్గాహొన్నూరు గ్రామాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. సాగుదారులకు అన్యాయం చేసి, అనర్హుల పేర్లను జాబితాలో చేర్చడంపై నిరసన వ్యక్తం అవుతోంది. ఉన్నతాధికారులు స్పందించి భూ పంపిణీ జాబితాపై సమగ్ర విచారణ జరిపి అనర్హులను తొలగించి, అర్హులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని మండల రైతులు కోరుతున్నారు.