Jul 28,2023 08:13

ఒక అడవిలో ఒక చెట్టు పైన కాకి, కోకిల తమ పిల్లలతో నివసించేవి. కాకి తన గూటిలోని పిల్లలకు ఆహారం తెచ్చేటప్పుడు, కోకిల పిల్లలకు కూడా పెట్టబోయేది. కానీ, కోకిల పిల్లలు తినేవికావు. కాకమ్మ పిల్లలతో ఆడుకునేవి కూడా కాదు. ఇదంతా గమనించిన కోకిల ఒక రోజు పిల్లలతో, 'మీరు కాకమ్మ తెచ్చే ఆహారం ఎందుకు తీసుకోవడం లేదు. తీసుకోవాలి కదా! అలాగే కాకమ్మ పిల్లలతో ఆడుకోవాలి కదా!' అంది.
అప్పుడు కోకిల పిల్లలు, 'కాకి అరుపులు వింటేనే మాకు చిరాగ్గా ఉంటుంది. అటువంటిది తాను తెచ్చిన ఆహారం ఎలా తింటాం? ఆ పిల్లలతో ఎలా ఆడుకుంటాం?' అన్నాయి.
'అలా అనకూడద'ని కోకిల ఎన్ని సార్లు చెప్పినా పిల్లలు తమ పద్ధతి మార్చుకోలేదు.
ఒకరోజు కోకిలమ్మ ఆహార సేకరణకి వెళ్లి పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికి అవి కాకమ్మ తెచ్చిన ఆహారం తింటూ కనిపించాయి. కోకిలమ్మ ఆశ్చర్యపోయింది. సంతోషంతో పిల్లలను దగ్గరకు తీసుకుని, 'ఏంటి ఈ రోజు కాకమ్మ తెచ్చిన ఆహారం చాలా ఇష్టంగా తింటున్నారు. ఏమిటి సంగతి' అని అడిగింది.
అప్పుడు కోకిలమ్మ పిల్లలు, కోతి మామ చెప్పిన సంగతులు చెప్పాయి. 'కాకమ్మ గూడులో నువ్వు గుడ్లు పెట్టడం, ఆ గుడ్లను కాకమ్మ తన గుడ్లతో పాటు పొదగడం' వంటి విషయాలన్నీ కోతి మామ చెప్పింది. ఇన్నాళ్లు కాకమ్మను చాలా బాధ పెట్టాం. ఇకపై అలా ఉండం. కాకమ్మ పిల్లలతో కూడా ఆడుకుంటాం' అన్నాయి. ఆ మాటలు విన్న కోకిల చాలా సంతోషపడింది. పిల్లల్లో మార్పు తెచ్చిన కోతి మామకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది.
 

- మొర్రి గోపి,
88978 82202