Jun 05,2023 11:21

ఒకపక్క ఆడపిల్లలు ప్రపంచస్థాయిలో ముందుకు దూసుకుపోతున్నా... మరోవైపు కనీసం పదో తరగతి చదవడం కూడా కష్టమవుతోంది. అటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని తాము ఈ ఏడాది పది పాసయ్యామని చెబుతున్నారు నలుగురు గిరిజన ఆడపిల్లలు.

బెంగాల్‌లో బీర్భూమ్‌లో బోల్‌పూర్‌ దగ్గర సాహెబ్దం గ్రామంలో కొన్ని గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారి నివాస ప్రాంతాలు పట్టణాలకు చాలా దూరం. పెద్దలతో పాటు పిల్లలు కూడా ఉపాధి కోసం కూలికి పోతారు. అందరూ కష్టపడితే నాలుగు వేళ్లూ నోట్లోకి వెళతాయి. అక్కడ వారంతా ఎక్కువగా ఓ పూట గంజి తాగి, మరో పూట అన్నం తింటారు. ఇంత పేదరికంలో అక్కడ పిల్లలు చదువుకోవడం అంటే చాలా కష్టం.
ప్రాథమిక పాఠశాల అందుబాట్లో ఉంటుంది కాబట్టి ఆడపిల్లలు, మగపిల్లలు వెళతారు. కానీ, హైస్కూలుకు వెళ్లాలంటే నాలుగు కిలోమీటర్లు నడవాలి. ఇంటికి వచ్చేసరికి చీకటి పడుతుంది. దీంతో, ఆడపిల్లల చదువు అక్కడితో ఆగిపోయేది. దూరంగా ఉన్న స్కూలికి పంపటం ఎందుకని ఆడపిల్లలను పంపేవారు కాదు తల్లిదండ్రులు.
           ఇలాంటి పరిస్థితిని అధిగమించి, పుస్తకాల సంచితో ఊరి పొలిమేర దాటారు నలుగురు ఆడపిల్లలు. వారి పేర్లు : బసంతి, లతికా, మీరూ, సుమిత్ర. ఈ సంవత్సరం పదో తరగతి చదివారు. అందుకు ఎంతో కష్టపడ్డారు. వీరు నలుగురూ చిన్నతనంలోనే ఓ ప్రమాదంలో తండ్రులను కోల్పోయారు. తల్లులు తెచ్చే కూలి డబ్బులతోనే ఇల్లు గడిచేది. సెలవు రోజుల్లో ఈ ఆడపిల్లలు కూడా తమ తల్లులతో కలిసి కూలి పనులకు వెళ్లేవారు. పదో తరగతిలో చదువుతున్నప్పుడు కూడా మధ్యలో కూలి పనులకు వెళ్లారు. వీరిలో ముగ్గురు స్కూలుకు వెళితే, నాలుగో అమ్మాయి పనికి వెళ్లేది. ఇంటికి వచ్చి స్నేహితుల దగ్గర పుస్తకాలు తీసుకుని ఆ రోజు చెప్పిన పాఠాలను రాసుకునేది. ఓ వైపు పనిచేసి అలిసిపోయి నిద్రవస్తున్నా... పాసవ్వాలన్న పట్టుదలతో చదివారు. ఒక్కోసారి స్కూలుకు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు భారీ వర్షం కురిసేది. పుస్తకాలు తడవకుండా గోనుపట్టాలు కప్పేవారు. తాము తడిచినా అలాగే స్కూలుకు వెళ్లేవారు. ఇలా ఇబ్బందులు పడుతూ, కుటుంబ ఆర్థిక పరిస్థితులు సైతం ఎదుర్కొని పదో తరగతిమంచి మార్కులతో పాలయ్యారు. ఇప్పుడు ఈ నలుగురినీ గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఆ గ్రామంలో పదో తరగతి చదివిన మొట్టమొదటి బాలికలు వీరే! భవిష్యత్తులో బాగా చదివి, తమ గ్రామంలో పిల్లల ఉన్నత చదువుకు కృషి చేస్తామని వారు చెబుతున్నారు.