Dec 26,2022 07:53

వాళ్లని ఏమని వర్ణించాలి ?
క్రమశిక్షణ నేర్చిన కుందేళ్లు !
నేల మీద నడయాడే నెలవంకలు
ఎవరైతే నేమి ?
వాళ్లు దయా దీపాలు
కరుణార్ద్ర పాదాల దేవదూతలు
ప్రేమ సదస్సులు సహన సరస్సులు
చీమలు నేర్పిన క్రమశిక్షణ ఏమో!
ఒకరి తర్వాత ఒకరు
బాధ్యతను భద్రంగా పట్టుకొని
మౌనాన్ని ఇంద్రధనస్సుల చిరునవ్వుగా
అలంకరించుకొని
అలా గదిలోకి నడిచొస్తారా!
ఓ లేలేత గాలి
మంత్రమేదో వేసినట్టు
వారి మీదుగా నన్ను తాకి
సేద తీరుస్తుంది!
వాళ్ల వెనుక ఎన్ని సుడిగుండాలన్నా
మృదు లేపనమేదో పూసుకుని
నాజూకు హంసల్లా..
కలగా.. కాలంగా నడిచొస్తారు
వారిని చూడగానే
ఏ మంత్రం వేస్తారో
నా లోలోపలి భయాలు
ఇట్టే పారిపోతాయి!
సూది దూది కన్నా మెత్తగా
దిగుతుంది నా దేహంలోకి -
లోని ముందు చుర చుర కుట్టినా
లోలోపలి బాధ మాత్రం
మెల్లిగా జారుకుంటుంది!
వారి సేవే నిజమైన ఔషధమని
నన్ను పెనవేసుకున్న హాయి నిర్ధారిస్తుంది!
నిద్ర తలుపులు తెరిచి
ఒకానొక ప్రశాంతతేదో..
నన్ను స్వప్నలోకాలకు ఆహ్వానిస్తుంది
ప్రాణ దూతలై
ఊపిరి శిక్షణాలను మోసుకొచ్చి
ఈ కాలానికి బహుకరించే
వినీత మనస్కులు వినమ్రమూర్తులు
వారు కదూ,
అసలైన దివ్య ధాత్రీదీప్తులు!

శిఖా - ఆకాష్‌
93815 22247