Oct 26,2023 21:05

సెన్సెక్స్‌ 900 పాయింట్ల పతనం
రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరి
ఏ దశలోనూ కోలుకోని సూచీలు
బోరుమన్న మదుపర్లు
న్యూఢిల్లీ : భారత స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. వరుసగా ఆరో రోజూ నేల చూపులు చూశాయి. గురువారం సెషన్‌లోనూ సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన షేర్లు.. ఏ దశలోనూ కోలుకోలేదు. బేర్‌ పంజాతో ఒక్క పూటలో లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరయ్యింది. తుదకు సెన్సెక్స్‌ 901 పాయింట్లు క్షీణించి 63,148కి పతనమయ్యింది. నిఫ్టీ కూడా 265 పాయింట్ల నష్టంతో 18,857కు పడిపోయి.. నాలుగు మాసాల కనిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. సెన్సెక్స్‌ ఉదయం 63,774.16 వద్ద ప్రారంభం కాగా.. ఇంట్రాడేలో 63,903 కనిష్ట స్థాయిని చవి చూసింది. విద్యుత్‌ రంగ సూచీలు మినహా మిగితా అన్ని రంగాలు పతనమయ్యాయి. ఒక్క పూటలోనే బిఎస్‌ఇ మార్కెట్‌ కాపిటలైజేషన్‌ రూ.323.8 లక్షల కోట్ల నుంచి రూ.306 లక్షల కోట్లకు పడిపోయింది. దీంతో దాదాపు రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. ఇంతక్రితం ఐదు సెషన్లలో రూ.14.6 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది.
ఇజ్రాయిల్‌ ా హమాస్‌ ఆందోళనకు తోడు, అమెరికన్‌ బాండ్‌లపై రాబడుల పెరుగుదల పెరగడం, ఎఫ్‌ఐఐలు తరలిపోవడం తదితర అంశాలు భారత మార్కెట్ల పతనానికి ప్రధాన కారణంగా ఉన్నాయి. యుద్ధంలో పశ్చిమాసియాలోని కొన్ని దేశాలు భాగస్వామ్యం కావడంతో పరిస్థితి మరింత తీవ్రతకు దారి తీస్తోంది. ఈ పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఆ ప్రభావం భారత ఈక్విటీ మార్కెట్లపైనా పడుతోంది. అమెరికా వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని మరింత దెబ్బతీస్తున్నాయి.
భారత ఈక్విటీ మార్కెట్లలో బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, ఆటో, మెటల్‌ రంగాల్లో అధికంగా అమ్మకాలు చోటు చేసుకున్నాయి. సెన్సెక్స్‌ా30 ఇండెక్స్‌లో ఐదు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటిసి, హెచ్‌సిఎల్‌ టెక్‌, ఎన్‌టిపిసి, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు రాణించాయి. ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫైనాన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, నెస్లే ఇండియా, టైటన్‌, జెఎస్‌డబ్ల్యు స్టీల్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, మారుతీ, టాటా మోటార్స్‌ షేర్లు అత్యధికంగా 4 శాతం వరకు నష్టపోయిన వాటిలో ఉన్నాయి. బిఎస్‌ఇలో దాదాపు 1211 సూచీలు లాభపడగా.. 1943 స్టాక్స్‌ నేల చూపులు చూశాయి. మరో 101 సూచీలు యథాతథంగా నమోదయ్యాయి.