May 10,2023 08:48

వేవికాలంలో ఎండ బారి నుంచి తట్టుకునేందుకు కాటన్‌ దుస్తులు ఎంతో అనువైనవి. నైలాన్‌, సింథటిక్‌, సిల్కు, నల్లని దుస్తులు చెమటను పీల్చుకోవు. దీంతో ఉష్ణోగ్రత అధికమై చర్మవ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. చిన్నారులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పిల్లల ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు తీసుకుంటూ.. కాటన్‌, ఖద్దర్‌, పలచగా ఉండి శరీరానికి గాలి తగిలే దుస్తులు వాడాలి. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి.

  • బయట పనులకు వెళ్లే వారు వదులుగా ఉండే దుస్తులు ధరించడం మంచిది. పిల్లలకు వేసే జుబ్బాలు, లంగోటీలు కూడా రోజు ఆరవేస్తూ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటే చంటి పిల్లలు చక్కగా ప్రశాంతంగా ఉంటారు.
  • మనం వేసుకోబోయే దుస్తుల్లో ముందుగా టాల్కం పౌడర్‌ చల్లుకుని వేసుకుంటే చెమట వల్ల కలిగే దుర్వాసన రాదు. సాధ్యమైనంత వరకు ఖద్దరు, పైజామా, కుర్తాలు దుస్తుల్ని వాడటం మంచిది. ఖద్దరు ప్రకృతి సహజమైనవి. కాబట్టి చర్మానికి మేలు. చెమట పోయదు. గాలి బాగా తగులుతుంది. శరీరం నుంచి వాసన రానివ్వదు.
  • గర్భిణులు వీలైనంత మేరకు వదులు దుస్తులనే ధరించాలి. అవి కూడా మెత్తగా, సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. ఈ దుస్తుల్లో లైట్‌ కలర్‌ దుస్తులు అయితే ఎంతో మంచిది. డార్క్‌ కలర్‌ దుస్తులు త్వరగా వేడిని గ్రహిస్తాయి.
  • ఎండలో వెళ్ళడం తప్పదు అనుకున్నప్పుడు తప్పనిసరిగా స్కార్ఫ్‌ను కానీ, గొడుగు కానీ ఉపయోగించాలి. వేసవి దుస్తులు మరీ వదులుగా లేక బిగుతుగా లేకుండా తగినట్లు ఉండాలి. దీనివల్ల శరీరానికి గాలి తగిలి చెమట పట్టటం తగ్గటమే గాక పట్టిన చెమటను దుస్తులు ఎప్పటికప్పుడు పీల్చుకోవటం సాధ్యమవుతుంది.
  • పగటి ఉష్ణోగ్రతలను తట్టుకోవాలంటే లేత రంగు దుస్తులు మంచిది. వీటిలో లేత నీలం, లేత గోధుమ రంగు, లేత గులాబీ రంగులైతే మరీ మంచిది. సాయంత్ర వేళలో నారింజ, ముదురు నీలం, చాక్లెట్‌ బ్రౌన్‌ రంగులు ఎంపిక చేసుకోవచ్చు.
  • మహిళలు లైట్‌ ప్రింటెడ్‌ కాటన్‌ దుస్తులు అయితే బాగుంటాయి. పగటి ఎండధాటికి నిలిచి, చెమటను పీల్చుకొనే లినన్‌ కాటన్‌, ఆర్గంజ, వంటివి మంచివి. సాయంత్రం వేళ కశ్మీరీ సిల్క్‌, మట్క సిల్క్‌, క్రేప్‌ సిల్క్‌ వంటివైతే సౌకర్యంగా ఉండటంతో బాటు అందంగానూ కనిపిస్తారు.