Apr 23,2023 10:24

న్యూయార్క్‌ : వచ్చే ఏడాది కాలంలో అమెరికాలో కార్పొరేట్‌ రుణాల ఎగవేతలు, మాంద్యం మరింతగా పెరగొచ్చని క్రెడిట్‌ పోర్టుఫోలియో మేనేజర్లు అంచనా వేస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మాంద్యంలోకి ప్రవేశించవచ్చని 84శాతం మంది భావిస్తున్నారు. క్రెడిట్‌ పోర్టుఫోలియో మేనేజర్ల అంతర్జాతీయ సమాఖ్య నిర్వహించిన త్రైమాసిక పోల్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయని బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొంది. రాబోయే 12 మాసాల్లో రుణాల చెల్లింపుల ఎగవేతలు పెరుగుతాయని 81శాతం మంది ఫండ్‌ మేనేజర్లు విశ్వసిస్తున్నారు. బ్యాంకుల లిక్విడిటీ తగ్గిపోవడం, సూక్ష్మ ఆర్థికాంశాలపై క్రెడిట్‌ రిస్క్‌ పట్ల ఆందోళనలు ఇందుకు కారణమని పేర్కొంది. నార్త్‌ అమెరికన్‌ కంపెనీలకు సంబంధించి అమెరికాలో రుణాల ఎగవేతలు పెరుగుతాయని 86శాతం మంది భావిస్తే, యూరప్‌లో పెరుగుతాయని 91శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఏదో ఒక సమయంలో మాంద్యం నెలకొంటుందని 84శాతం మంది భావిస్తుండగా, ఆ పరిస్థితి యూరప్‌లోనో లేదా బ్రిటన్‌లోనో వుంటుందని 61శాతం మంది పేర్కొంటున్నారు. రాబోయే మూడు మాసాల్లో నార్త్‌ అమెరికన్‌ కంపెనీల రుణాలు దాదాపు 60శాతం పెరుగుతాయని భావిస్తున్నారు.
 

                                                        సిలికాన్‌ కేంపస్‌ ప్రాజెక్టును నిలిపివేసిన గూగుల్‌

సిలికాన్‌ వ్యాలీ నగరమైన శాన్‌జోస్‌లో పెద్ద కేంపస్‌ నిర్మాణాన్ని గూగుల్‌ నిలిపివేసింది. వ్యయాన్ని కుదించుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు సిఎన్‌బిసి తెలిపింది. అంతర్జాతీయంగా 12వేల ఉద్యోగాల్లో కోత విధిస్తున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో గూగుల్‌ మాతృ కంపెనీ అల్ఫాబెట్‌ ప్రకటించింది.
         సవాలుగా మారిన ఆర్థిక పరిస్థితులను ఇందుకు కారణాలుగా పేర్కొంది. గతేడాది చివరి మూడు మాసాల్లో ఆశించినంతగా ఆదాయం, లాభాలు లేవని ఆల్ఫాబెట్‌ తెలిపింది. కఠినమైన ఆర్థిక పరిస్థితులు తమ వ్యాపార వాణిజ్య అవకాశాలను దెబ్బతీశాయని తెలిపింది. డౌన్‌టౌన్‌ వెస్ట్‌ కేంపస్‌ నిర్మాణానికి అనుమతినిచ్చినప్పటికీ పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో వుంచుకుని ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టును ఆపాలని భావించినట్లు సిఎన్‌బిసి నివేదిక తెలిపింది. అయితే తిరిగి దీన్ని ఎప్పుడు ప్రారంభించేది వంటి వివరాలు వెల్లడించలేదు. 32 హెక్టార్లలో ఆఫీసు కార్యాలయం, ఇళ్ళు, పబ్లిక్‌ పార్కులు నిర్మించాలన్నది గూగుల్‌ ఆలోచనగా వుంది.