Dec 12,2022 08:01

జీవితాన్నిచ్చిన నాన్న పట్ల తన అంతరంగ భావాలను పాతిక అక్షరాల్లో అభివ్యక్తీకరించిన తీరు అద్భుతం, అభినందనీయం. నాన్నకు ప్రేమ పూర్వకంగా అందించిన కతజ్ఞతా కావ్యం 'నాన్న నానీలు'. ఇందులో 107 నానీలు నాన్నను అభిషేకించాయి. కుటుంబ పోషణకు నాన్న మోసిన బరువులు, బాధ్యతలు, చిందించిన స్వేదం, కరిగించిన కండరాల, నరాల సత్తువను చిత్రిక పట్టి దుర్భిణీ వలే నానీల్లో దర్శింపజేస్తాడు కవి వెన్నెల సత్యం.
      నాన్నగా బాధ్యతలు నెరపుటలో పడిన శ్రమ, కుటుంబం, పిల్లలు, తలిదండ్రులు, బంధువులు, సమాజం అన్ని అంశాలలో నడుచుకున్న తీరు బాల్యం నుండి గమనించివాడు కావడం నాన్న బాధలను బరువులను స్వగతంగా 'నానీలు'గా చిత్రికపట్టాడు.
        నాన్న శ్రమను, త్యాగాన్ని ఉచితమైన ప్రతీకలతో నానీలుగా ప్రతిధ్వనింపజేసినా.. ఇందులో అందరి నాన్నల శ్రమ, బాధలు, త్యాగాలు సార్వజనీనమై ప్రతిబింబిస్తాయి. నాన్నగా మారితే గాని నాన్న బాధ్యతేమిటో, విలువేమిటో, పిల్లలకు ఆయన మార్గదర్శనమేమిటో, తన కష్టాలను దాచుకొని, పిల్లల ఆకలి తీర్చడానికి తను కడుపుమాడ్చుకొని పస్తులుండిన రోజులు గుర్తుకు తెస్తాయి.
        కుటుంబం, పిల్లల ఉన్నతిని కాంక్షించే సగటునాన్న పడే తపనను మథిస్తాయి. కష్టాలన్నీ నాన్నే ఓపికతో భరిస్తాడు.పిల్లలకు తెలియనీయక.. తానెప్పుడూ కష్టాలలోనే మిగిలిపోతాడు.. ఈ నానీ చూడండి.

నాన్నంటే
అలుపెరుగని అల
బిడ్డల్ని ఒడ్డుకు చేర్చి
తాను సంద్రం లోనే
పిల్లల ఎదుగుదలకు కారణమయ్యే నాన్న ఆఖరిమజిలీలో అనాథగా ఆదరణ లేక బతుకుతాడని హద్యంగా చెప్పిన ఈ నానీ చదవండి..
నాడేమో
కొండల్ని పిండి చేశాడు
నేడేమో ఆశ్రమంలో
గుండెల్ని పిండేస్తూ..!

నానీలో కొందరి నాన్నల నేటి స్థితిని ఆర్ద్రంగా పలికిస్తాడు. నాన్నమాటలు అప్పటికి కటువుగా ఉన్నా పిల్లల భవిష్యత్తు బాగుకు రత్నాల్లా విలువైనవేనంటాడు మరో నానీలో. నాన్న వత్తిని ఉటంకిస్తూ..ఆయన వాడిన పనిముట్లూ తనకు విలువైనవే నంటాడు బిడ్డలు గెలుపు కోసం నాన్నెప్పుడూ ఓడిపోతూనే ఉంటాడనీ బిడ్డలు ఎదుగుటలో తన పాత్ర ఉన్నా లేకున్నా సాధింపులూ ఈసడింపులూ ఆయనకే చెల్లుతాయని, సంపదలు కూడబట్టకపోయినా.. నాన్నను గుండెలో దైవంగా కొలవాలని కవి తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తాడు.
         కుటుంబం గడవడానికి నాన్న లెక్కలు నాన్నవి.పిల్లలకు అవి అర్థం కాని ఛాదస్తపు లెక్కల్లా తోస్తాయి. సాధించింది.. సంపాదించిదంతా బిడ్డలకు ప్రేమపంచి నంక నాన్న ఇంకా ఎమీ మిగుల్చుకోని గుండెలేని మనిషేనంటాడు. నాన్నంటే భయపెట్టే భూతం కాదు భవిష్యత్తు దర్శింజేసే భూతద్దమని ఆయన గొప్పతనాన్ని కీర్తిస్తాడు..
        ఆస్తులు కూడబెట్టడం ఎన్నోపాట్లు పడినా ఆఖరుకు అనాథాశ్రమంలో కాలం వెళ్ళబుస్తున్న కొందరి నాన్నల దీనస్థితిని...నేటి సమాజపోకడలు, అయినవారి అనాదరణను విశ్లేషిస్తారు కవి.
మంచినీటి చెలిమె అందరికీ ఉపయోగకరం
ఉప్పునీటి చెలిమె ఎవరికీ పనికిరాదని, వార్థక్యంలో నాన్నా ఆ ఉప్పుచెలిమెననీ, ఎవరికీ పట్టరనీ తన బాధను వెళ్ళగక్కుతారు కవి. నాన్న ఔన్నత్యాన్ని చాటిన నానీ ఇది.
నాన్న మాయలోడు
మాకన్నీళ్ళను
ఆనందభాష్పాలుగా
మారుస్తాడు మరి !
అందిరికీ నాన్నయ్యాకే అనుభవంలోకి వస్తాయని మరో నానీలో వెలిబుచ్చుతాడు.భౌతికంగా తన నాన్న తనను వీడడం తనకెంత బాధాకరమో, ఆయన తన జీవితానికి అందించిన నిచ్చెనలు, మిగిల్చిన గుర్తులను తలచుకొని కుమిలిపోతుంటారు..
తింటున్న జిలేబీ
చేదయ్యింది
పొట్లాం మీద
నాన్న నిర్యాణం ఫోటో
నాన్న చిందించిన చెమటే పిల్లల ఉన్నతికి బాటలు వేస్తుందని నాన్న శ్రమను ప్రేమగా నిమురుతాడు.
ఇలా 107 నానీలలతో నాన్న ప్రేమను, త్యాగాన్ని, విలువను, జీవితానికి నాన్న గొప్పతనాన్ని, నాన్నపట్ల తనకుగల ప్రేమనూ,అనుబంధాన్ని బహుగొప్పగా కీర్తిస్తూ వెన్నెల సత్యం అక్షరాభిషేకంచేసారు. కవిత్వంలో, సాహిత్యంలో వెనుకబడిన నాన్నకు ఈ కతి నిజంగా ''నాన్నకు పట్టాభిషేకం'' చేసిందనుటలో అతిశయోక్తిలేదు.

(పుస్తకం పేజీలు:44 వెల: 60/- వివరాలకు.. రచయిత వెన్నెల సత్యం 9440032210)
- మధు జెల్లా
9398340075.