రాజకీయ అంశాలు కథల్లో అంత సులభంగా ఇమడవు. దానికి ఎంతో పరిణితి అవసరం. కథా లక్షణాలు దెబ్బతినకుండా, కథ కాస్తా వార్తాకథనంలా మారకుండా తగిన జాగ్రత్తలతో రచయిత కథని మలచాల్సి ఉంటుంది. ఈ పనిని చాలామంది యువ కథకులు చేయబోయి చేతులు కాల్చుకున్నారు. కానీ 'సిక్స్ ప్యాక్ రాముడు' - కథల పుస్తకం వేసిన పావనిలో ఆ తడబాటు ఎక్కడా కనబడదు. చెప్పదల్చుకున్న విషయాన్ని సూటిగా తనదైన ఎత్తుగడతో వివరించి వదిలేస్తుంది. ఏదో వ్యాసం చదువుతున్నట్టు కాకుండా కథలో భాగంగానే అనేక వర్తమాన రాజకీయ అంశాలను చర్చకు పెడుతుంది.
నిజానికి విప్లవ, అభ్యుదయ భావజాలం ఉన్న రచయితల్లో కొందరు ఈ పనిని ఇది వరకే విజయవంతంగా చేసి చూపించారు. ఆ కోవలోనే పయనిస్తున్న యువ రచయిత్రి పావని గత దశాబ్ద కాలంలో దేశంలో జరుగుతున్న అనేక పరిణామాలను ఈ కథల్లో చర్చిస్తుంది. మతం, దేశభక్తి, స్వాభిమానం పేరుతో జరుగుతున్న రాజకీయం, పెట్టుబడి వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో స్పష్టంగా చెబుతుంది.
రష్యా విప్లవ నేత లెనిన్ చెప్పినట్టు 'ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోనంత వరకు ప్రజలు మోసపోతూనే ఉంటారు'. చాలాచోట్ల పాలకులు ప్రజలను ప్రశాంతంగా ఉండనివ్వరు. వారిలో ఎప్పుడూ ఏదో ఒక అశాంతిని రగిలిస్తూ ఉంటారు. ప్రశాంతంగా ఉన్న ప్రజలు అభివృద్ధి గురించి, హక్కుల గురించి, అన్యాయాల గురించి అక్రమ వ్యాపారాల గురించి అడుగుతారు. అందుకే వారిలో ఎప్పుడూ కృత్రిమంగా ఏదో ఒక భావోద్వేగాన్ని రగిలించడం వారికి నిత్యావసరం. ఇక్కడే పావనిలాంటి యువ రచయిత్రుల అవసరం మనకు ఉంది. ఇలాంటి వారు ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనం ఉందో తమ కలం కన్నుతో పసిగట్టి తమకు నచ్చిన కళారూపాల్లో ప్రజలకు చెబుతారు. ఆ విషయంలో పావని విజయవంతం అయింది.
పావని తన కథల పుస్తకానికి 'సిక్స్ ప్యాక్ రాముడు' అనే పేరు పెట్టడంలోనే ఎంతో వైవిధ్యం చూపించింది. అసలు ఆ పేరులోనే ఎంతో వర్తమానం ఉంది. ఒకప్పుడు దేవుళ్లంటే దయామయులు, కరుణ రసం ఉన్నవాళ్లు. కులమతాలకు అతీతంగా అడిగినవాళ్లందరికీ కాదనకుండా వరాలిచ్చేవాళ్లు. ఇప్పుడలా కాదు. ఇప్పుడు దేవుళ్లు కోపంతో రగిలిపోతున్నారు. కండలు పెంచుతున్నారు. కళ్లల్లో రౌద్రం పండిస్తున్నారు. ఆ ఆకారాలతో ఒక వర్గం ప్రజల్లో అభద్రతను పెంచుతున్నారు.
చివరికి చిన్న పిల్లలను సైతం వదలకుండా వారిని ఆట పాటలతో మచ్చిక చేసుకుని తర్వాత తిన్నగా వారి హృదయాల్లో విషం చిమ్ముతున్న తీరును టైటిల్ కథలో చెబుతుంది పావని.
పావని రాయలసీమ నుంచి వచ్చిన రచయిత్రి. ఆమె కథల్లో ఆ ప్రాంత మాండలికం, సామరస్యం కనబడుతుంది. కడప సూఫీ సాధువు హజ్రత్ అలీ పేరు మీద హజ్రత్ అని పేరు పెట్టుకున్న ఒక వ్యక్తిని ఒక మతోన్మాద మూక చంపేస్తుంది (భక్తి మార్గం). మతం గుడ్డిది, తమ మతం ఎవరిదో పరమతం ఎవరిదో గుర్తించలేనంత అంధకారమైంది. అందుకే దాని చేతికి పగ్గాలు ఇస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయని వివరించి చెబుతుంది రచయిత్రి.
ఒక ఆవు వీధిలో అదుపు తప్పుతుంది (ఆవు ఆత్మహత్య). ఒకరిద్దరి మీద దాడి చేస్తుంది. ఇక దాన్ని అదుపు చేయడానికి వీధిలో ఎవరికీ గుండెలు చాలవు. అదే కుక్కయితే ఈపాటికి చంపేసేవాళ్లు, పులి అయితే తరిమేసేవాళ్లు, ఏనుగు అయినా సరే బంధించే వాళ్లు.. కానీ అది ఆవు.. రాజకీయ అంశంగా మారిన ఆవు. అది తిరగబడి జనాల్ని చంపేస్తున్నా దాన్నేమీ అనకూడదు. ఈ కథను బోల్డంత వ్యంగ్యంతో ప్రతీకాత్మకంగా చెప్పి మెప్పిస్తుంది రచయిత్రి. ఈ మధ్య ప్రేమికుల రోజు నాడు 'కౌ హగ్ డే' కోసం పిలుపునిచ్చి ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిన పాలకులు గుర్తొస్తారు ఈ కథ చదివితే.
నలుపు, తెలుపు వర్ణాల పేరుతో జరుగుతున్న రాజకీయం, వ్యాపారం మీద కూడా పట్టింపు ఉంది రచయిత్రికి. నల్లగా ఉన్న తనను అందరూ శూర్పనఖ (నా పేరు శూర్పనఖ) అంటుంటే బాధపడుతుంది కథలోని ప్రధాన పాత్ర. తర్వాత అదే పాత్ర చివర్లో తనను శూర్పనఖ అన్నందుకు ఆనందపడుతుంది. సంతృప్తి చెందుతుంది. ఇక ముందు తాను శూర్పనఖ గానే గుర్తింపు పొందాలని కోరుకుంటుంది. ఈ మధ్యలో ఏం జరిగిందనేదే కథ.
అయోధ్యలో రామమందిరం కోసం ఇటుకలు తయారు చేస్తుంది ఒక పాత్ర (గోడలు). తీర్థయాత్రలు చేసి పరమతానికి చెందిన స్నేహితుణ్ని దూరంగా పెడుతుంది. తర్వాత రాజకీయం తెలుసుకుని పశ్చాత్తాపంతో ఇలా అంటుంది - 'ఇటుకలు గుడి కట్టేందుకు కాదు; జనం మధ్య గోడలు కట్టేందుకు.. చివరికి నీకూ నాకూ మధ్య కూడా, వాళ్లు ఎప్పటికీ గోడలు కట్టలేరు, ఎందుకంటే జనం మధ్య గోడలు కట్టడానికి వారికి ఇటుకలు సరిపోవు'. చాలా ఆశావాద దృక్పథంతో ముగుస్తుంది ఈ కథ.
ముందే చెప్పినట్టు ఈ పుస్తకం చదువుతున్నంత సేపు మనకు వర్తమాన భారతం కళ్లకు కడుతుంది. పైకి సామాన్యంగా కనిపించే అనేక విషయాల వెనుక అసలు కథేంటో తెలిసిి మనకు కళ్లు తెరుచుకుంటాయి. ఏ కథాసాహిత్యానికైనా ఇంతకుమించిన సామాజిక ప్రయోజనం మరేముంటుంది? తొలి పుస్తకమే అయినా గురి తప్పకుండా విషయం చెప్పే సత్తా ఉందని చాటిన ఈ రచయిత్రి నుంచి మరిన్ని మంచి కథలను ఆశించవచ్చు.
(సిక్స్ ప్యాక్ రాముడు (కథలు), రచయిత్రి: పావని, ప్రచురణ: విరసం, ధర : రూ.120, ప్రతులకు : అన్ని పుస్తక కేంద్రాలు.)
- డా. వేంపల్లె షరీఫ్
9603429366










