
- రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ వెల్లడి
ప్రజాశక్తి -సామర్లకోట రూరల్(కాకినాడ జిల్లా) : రాష్ట్ర వ్యాప్తంగా 17,005 జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో మంగళవారం ఆయన పర్యటించారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, ఎండి డాక్టర్ జి లక్ష్మీశ, కాకినాడ ఎంపి వంగా గీత, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికాశుక్లాతో కలిసి సిఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి రమేష్ మాట్లాడుతూ సామర్లకోట ఇటిసి లే-అవుట్‌లో 2,400 ఇళ్లకు వెయ్యి ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. ముఖ్యమంత్రి సమక్షంలో ఈ నెల ఐదున పూర్తయిన ఇళ్లల్లో గృహ ప్రవేశాలు నిర్వహిస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 21.75 లక్షల ఇళ్లకు, 6.82 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయినట్లు తెలిపారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణాలు నేడు జరుగుతున్నాయన్నారు. ఈ నిర్మాణాలను వేగవంతం చేసేందుకు దవులూరి దొరబాబు చేస్తున్న కృషిని అభినందించారు. ఆయన వెంట ఎస్‌పి సతీష్‌కుమార్, హౌసింగ్ అధికారులు ఉన్నారు.