Aug 03,2022 22:38

విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులను అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు
-అయినా సమావేశం విజయవంతం
-ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన జెఎసి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కం శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో నిర్బంధానికి దిగింది. ప్రతిపక్షనేతగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీల అమలుపై చర్చించి, భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించుకునేందుకు బుధవారం ఏర్పాటు చేసిన సదస్సును అడ్డుకోవడానికి ప్రయత్నించింది. సదస్సు జరిగే ఎంబివికెలోకి విద్యుత్‌ కాంట్రాక్టు ఉద్యోగులను ఒక్కరిని కూడా అడుగుపెట్టకుండా చూడాలని పోలీసులకు అదేశాలు అందాయి. దీంతో ఎంబివికెతో పాటు, పరిసరప్రాంతాల్లో భారీ స్థాయిలో పోలీసులు మొహరించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విద్యుత్‌ కాంట్రాక్టు ఉద్యోగులను పెద్ద సంఖ్యలో అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ సమావేశానికి వెళ్లవద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. వీటిని లెక్కచేయకుండా బయలుదేరిన వారిని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో కూడా అదుపులోకి తీసుకున్నారు. నాలుగు గోడల మధ్య జరిగే సమావేశాన్ని కూడా అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించడం, ఈ స్థాయిలో పోలీసులను మొహరింపచేసి నిర్బంధానికి దిగడం చర్చనీయాంశంగా మారింది. అయితే, పోలీసుల బెదిరింపులను, నిర్బంధాన్ని బేఖాతరు చేస్తూ పెద్ద సంఖ్యలో విద్యుత్‌ కాంట్రాక్టు ఉద్యోగులు బారికేడ్లను దాటుకుని ఎంబివికె వద్దకు చేరుకున్నారు. పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఎపి విద్యుత్‌ కాంట్రాక్టు కార్మిక సంఘాల జెఎసి ఛైర్మన్‌ ఎం బాలకాశి, సిఐటియు నాయకులు ఎవి నాగేశ్వరరావు, ముజఫర్‌ అహ్మద్‌, నూర్‌ అహ్మద్‌, ఎఐటియుసి నాయకులు రాధాకృష్ణమూర్తి తదితరులు శాంతియుత పద్ధతుల్లో ఇండోర్‌లో సదస్సు జరుపుకుంటుంటే అడ్డుకోవడమేంటని పోలీసు అధికారులను ప్రశ్నించారు. మరోవైపు కార్మికుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో తప్పని పరిస్థితిలో పోలీసులు పక్కకు తప్పుకున్నారు. అనంతరం జరిగిన సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, టీచర్లు, కార్మికుల జెఎసి ఛైర్మన్‌ ఎవి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను విస్మరించడం తగదన్నారు. చంద్రబాబు రెగ్యులర్‌ చేయడం లేదని, తాను అధికారంలోకి రాగానే అందరినీ రెగ్యులర్‌ చేస్తానని అసెంబ్లీ, ప్రజాసంకల్ప యాత్రలో హామీ ఇచ్చారని అన్నారు. మూడేళ్లు దాటినా ఇచ్చిన హామీని అమలు చేయకపోగా అడిగితే అరెస్టులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి నిర్బంధాలు, అరెస్టులు కార్మిక ఉద్యమాలను ఆపలేవని ముఖ్యమంత్రి తెలుసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు వెళ్లినట్లు రాష్ట్రంలోని విద్యుత్‌ రంగంలోని ఉద్యోగులు, కార్మికులంతా గడపగడపకు వెళ్లి జగన్‌ మాటతప్పిన తీరును ఎండగట్టాలని అన్నారు.
ఎఐటియుసి రాష్ట్ర గౌరవాధ్యక్షులు వి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ.. చట్టప్రకారం వేతనాలు ఇవ్వాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని కోరితే పోలీసులతో నిర్బంధాలకు గురిచేయడం తగదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కుని ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నాయని అన్నారు. కార్మికులంతా ఈ విధానాలకు వ్యతిరేకంగా సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
అంచెలంచెలుగా ఉద్యమం ఉధృతం
విద్యుత్‌ రంగంలోని జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌లలో కనీస వేతనాలకు నోచుకోకుండా వెట్టిచాకిరి చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకూ ఉద్యమాన్ని అంచెలంచెలుగా ఉధృతం చేస్తామని ఎపి విద్యుత్‌ కాంట్రాక్టు కార్మిక సంఘాల జెఎసి ఛైర్మన్‌ ఎం బాలకాశి హెచ్చరించారు. దాదాపు 20 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేయాలని, సమానపనికి సమాన వేతనం ఇవ్వాలనే డిమాండ్ల సాధన కోసం ఉద్యమ కార్యాచరణను ఈ సదస్సు ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ తీర్మానాలను బాలకాశి ప్రకటించారు. ఆగస్టు 4 నుంచి 15వ తేదీలోపు అన్ని జిల్లాల్లో జెఎసిలను ఏర్పాటు చేయాలన్నారు. ఆగస్టు 16 నుంచి 25వ తేదీలోపు అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించాలని తెలిపారు. ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 1 వరకూ జిల్లాల్లో ఉండే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపిలకు లేఖలు రాయాలన్నారు. సెప్టెంబరు 5న అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని తెలిపారు. సెప్టెంబరు 6 నుంచి 12వ తేదీ వరకు అందరూ నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకావాలన్నారు. సెప్టెంబరు 13న ఎస్‌పిడిసిఎల్‌, 19న సిపిడిసిఎల్‌, 26న ఇపిడిసిఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. సెప్టెంబరు 28న ఇబ్రహీంపట్నంలోని విటిపిఎస్‌, అక్టోబరు 7న ఆర్‌టిపిపి వద్ద, 12న ఎస్‌డిఎస్‌టిపిఎస్‌ వద్ద బహిరంగ సభలు నిర్వహించాలన్నారు. అక్టోబరు 20న చలో విద్యుత్‌సౌద కోసం భారీగా విజయవాడలోని గుణదలకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో జెఎసి నాయకులు సూరిబాబు, సి చంద్రశేఖర్‌, వి అప్పారావు తదితరులు పాల్గన్నారు.