Sep 25,2023 08:41

న్యూఢిల్లీ : తన హత్యకు కుట్ర జరుగుతోందని బిఎస్‌పి ఎంపి డానిష్‌ అలీ ఆరోపించారు. న్యూఢిల్లీలోని తన నివాసం వద్ద ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లోక్‌సభలో తనపై బిజెపి ఎంపి రమేష్‌ బిధూరి మాటలతో దాడి చేసిన తరువాత, ఇప్పుడు పార్లమెంట్‌ వెలుపల తనను భౌతికంగా అంతమొందించడానికి కుట్ర జరుగుతోందని చెప్పారు. బిజెపి ఎంపి నిషికాంత్‌ దూబే ఆరోపణలన్నీ నిరాధారమని చెప్పారు. 'ఈ నిరాధారమైన ఆరోపణపై దర్యాప్తు చేయవలసిందిగా స్పీకర్‌ను అభ్యర్థిస్తున్నాను. ఈ ఆరోపణలు చేసిన నిషికాంత్‌ దూబేపై పార్లమెంట్‌ నిబంధనల ప్రకారం కేసు కూడా పెట్టవచ్చు' అని అన్నారు. ఇటీవల పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల సందర్భంగా గురువారం లోక్‌సభలో చంద్రయాన్‌-3పై చర్చ జరుగుతున్న సమయంలో అలీపై బిజెపి ఎంపి బిధూరి తీవ్ర అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో అలీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. స్పీకర్‌ బిధూరిని మందలించి వదిలేశారు. బిధూరిని పార్లమెంట్‌ నుంచి సస్పెండ్‌ చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి.
 

                                                                         దూబే లేఖలో ఏముంది ?

ఈ నేపథ్యంలో మరొక బిజెపి ఎంపి నిషికాంత్‌ దూబే అలీపై ఆరోపణలు చేయడంతోపాటు స్పీకర్‌ ఓం బిర్లాకు శనివారం లేఖ రాశారు. గురువారం అలీ సభలో అసహ్యకరంగా ప్రవర్తించారని, ప్రధాని మోడీపై విపరీత వ్యాఖ్యలు చేశారని దూబే తన లేఖలో ఆరోపించారు. ప్రధానిపై అలీ అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం బిధూరిని రెచ్చగొట్టిందని లేఖలో దూబే పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో చేరాలని అలీ భావిస్తున్నారని, దేశంలో మైనారిటీలు సురక్షితంగా లేరని ప్రచారం చేయడానికి కాంగ్రెస్‌, అలీ కుట్ర పన్నారని ఆరోపించారు.