ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు ఇతర ప్రాధాన్య ప్రాజెక్టులపై సిఎస్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుల వారీ ఇప్పటివరకూ పూర్తి చేసిన పనుల ప్రగతి, ఇంకా పూర్తి చేయాల్సిన పనులు, నిర్వాసితులకు అమలు చేయాల్సిన పునరావాస పనులపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు పనులు, పునరావాస ఫ్యాకేజీకి ఇప్పటి వరకూ చేపట్టిన పనుల పురోగతిపై చర్చించారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు, ఔకు టన్నల్, గొట్టా బ్యారేజీ నుంచి హిరమండలం ఇరిగేషన్ ప్రాజెక్టు, వంశధార-నాగావళి నదుల అనుసంధానం, గొట్టా బ్యారేజీ రిజర్వాయరు ప్రాజెక్టు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఫేజ్-2 తదితర ప్రాజెక్టుల ప్రగతిపై చర్చించారు. ఈ ఐదు ప్రాజెక్టులను ఈ ఏడాదిలో పూర్తి చేసి ప్రారంభించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్‌కుమార్, ఇఎన్‌సి సి నారాయణరెడ్డి, ఆర్‌అండ్‌ఆర్ కమిషనరు చెరుకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.










