May 30,2023 21:16

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : జల్‌జీవన్‌ మిషన్‌ పథకం అమలులో భాగంగా జెజెఎస్‌-2023కు సంబంధించి బెస్ట్‌ పెర్ఫామెన్స్‌, ఫాస్టెస్ట్‌ మూవింగ్‌ అను కేటగిరీల్లో మొదటి ఆరు నెలల కాలానికి రాష్ట్రంలోని 2 జిల్లాలకు ఉత్తమ ర్యాంకులు లభించాయని సిఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వైఎస్‌ఆర్‌ కడప, విశాఖపట్నం జిల్లాలు జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకుల్లో నిలిచాయన్నారు. గత అక్టోబరు నుంచి 2023 మార్చి 31 వరకు ఆస్పిరేషన్‌లో డిస్ట్రిక్ట్స్‌ కేటగిరిలో హై అచీవర్స్‌ కింద వైఎస్‌ఆర్‌ కడప జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో 75 నుంచి 100 శాతం మధ్య గృహాలకు కుళాయి కనెక్షన్లు కల్పించడం ద్వారా 1/20 ర్యాంకుతో నిలిచిందని తెలిపారు. విశాఖపట్నం జిల్లా ఆస్పిరేషనల్‌ జిల్లాల విభాగంలో 50 నుంచి 75 శాతం మధ్య గృహ కుళాయి కనెక్షన్ల కవరేజి విషయంలో 1/21 ర్యాంకుతో నిలిచిందని పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా అచీవర్స్‌ విభాగంలో 50 నుంచి 75 శాతం గృహ కుళాయిల కవరేజి అంశంలో 3/168 ర్యాంకుతో నిలిచిందని అన్నారు. అర్ధ సంవత్సర ర్యాంకులు.. రానున్న వార్షిక జాతీయ ఉత్తమ ర్యాంకుల ఖరారులో దోహదం చేస్తాయని జల్‌జీవన్‌ మిషన్‌ అదనపు కార్యదర్శి రాష్ట్రానికి రాసిన లేఖలో పేర్కొన్నట్లు సిఎస్‌ వెల్లడించారు. డిపార్టుమెంట్‌ ఆఫ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ అండ్‌ శానిటేషన్‌ దేశానికి అవసరమైన తాగునీరు, పారిశుధ్య అవసరాలను తీర్చడానికి రెండు ప్రధాన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.
స్వచ్ఛభారత్‌ మిషన్‌, గ్రామీణ్‌ (ఎసిబిఎం-జి), జల్‌జీవన్‌ మిషన్‌ (జెజెఎం) ఎస్‌బిఎం-జి సంపూర్ణ పారిశుధ్యాన్ని అందించడం ద్వారా గ్రామీణ భారతదేశాన్ని ఒడిఎఫ్‌ప్లస్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంటే జెజెఎం ద్వారా ప్రతి ఇంటికీ నాణ్యమైన కుళాయి నీటి సరఫరా అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. జెజెఎం రెండింటిలో పర్యవేక్షణ మూల్యాంకణ యంత్రాంగాల్లో ఒకటి అసెస్‌మెంట్‌ సర్వేలు అంటే స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌ (ఎస్‌ఎస్‌జి), జల్‌జీవన్‌ సర్వేక్షణ్‌ (జెజెఎస్‌), ఎస్‌బిఎంలో వాటి పనితీరు ఆధారంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి జిల్లాలను ర్యాంకింగ్‌ చేస్తాయని సిఎస్‌ వెల్లడించారు.