
- ఇంకా అమల్లోకిరాని బీమా
- వచ్చినా ప్రైవేటు కంపెనీల దయాదాక్షిణ్యం
- ఎనిమిదేళ్లనాటి లెక్కబట్టి పెట్టుబడి రాయితీ
- ప్రత్యేకంగా సాయం నిర్ణయిస్తేనే
- రైతుకు ఉపశమనం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : కరువు దెబ్బతో లక్షలాది ఎకరాల్లో ఖరీఫ్ పంటలు నష్టపోయిన అన్నదాతలు తమను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశతో ఎదురు చూస్తుండగా, రైతులకు చెల్లించే పరిహారం విషయంలో సర్కారు పరిహాసం ఆడుతోంది. పైర్లు కోల్పోయిన రైతన్నలకు రెండు మార్గాల్లో ఆర్థిక సహాయం అందుతుంది. ఒకటి పంటల బీమా కాగా రెండవది పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్ సబ్సిడీ). ఇప్పటి వరకు బీమా పథకాలేవీ పూర్తి స్థాయిలో అధికారికంగా అమల్లోకి రాలేదు. దిగుబడి ఆధారిత బీమా (ఫసల్ బీమా) విషయానికొస్తే మూడు జిల్లాల్లోని ఐదు మండలాల్లో 16 మంది రైతుల దరఖాస్తులే కేంద్రం వద్ద ఇప్పటి వరకు ఆమోదం పొందాయి. వాతావరణ ఆధారిత బీమాలో ఒక్క రైతు పేరు కూడా ఇంకా ఎక్కలేదు. ఇ-క్రాప్‌లో నమోదైన రైతులందరూ బీమా పరిధిలోకొచ్చేస్తారని ప్రభుత్వం పేర్కొనగా, ఇ-క్రాప్ ప్రక్రియ తుది దశలో ఉంది. కేంద్రం పథకాల్లో చేరినందున దేశ వ్యాప్తంగా నిర్ణయించిన కట్ ఆఫ్ డేట్ ప్రామాణికంగా ఉంది. దాటిన పక్షంలో మన రాష్ట్ర రైతుల బీమా పరిస్థితేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదే జరిగితే కరువు వలన పంట నష్టపోయిన రైతుల్లో పెద్ద ఎత్తున పరిహారం కోల్పోవాల్సి వస్తుంది. ఇదిలా ఉండగా, విపత్తుల వలన పంటలు నష్టపోయిన రైతులకు చాలా తక్కువ మొత్తంలో సర్కారు పరిహారం ఇస్తోంది. ఎప్పుడో 2015లో నిర్ణయించిన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫంఢ్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌నే అమలు చేస్తోంది. నిబంధనలను దాటుకొని రైతులు ఇన్‌పుట్ సబ్సిడీకి అర్హత సాధించడమే గగనమవుతుండగా, ఇచ్చేది నామమాత్రం కావడంతో ఏమూలకూ చాలట్లేదు. ఎనిమిదేళ్ల క్రితం నిర్ణయించిన సహాయమే ఇప్పటికీ కొనసాగుతుండగా, ఈ కాలంలో పంటల సాగుకు రైతులకయ్యే పెట్టుబడులు భారీగా పెరిగాయి.
ఇన్సూరెన్స్
వైసిపి సర్కారు వచ్చాక ముందటేడు వరకు ఇన్సూరెన్స్ కంపెనీలతో సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వమే బీమా నిర్వహించింది. గతేడాది ఫసల్ బీమాలో చేరింది. వాతావరణ బీమా మాత్రం తానే నిర్వహించింది. కాగా కంపెనీలు నిర్వహించిన ఫసల్ బీమాలో రైతులకు సరిగ్గా చెల్లింపులు జరగలేదు. ఈ పరిస్థితి ఉండగానే ఈ సంవత్సరం వాతావరణ బీమాను కూడా కేంద్రం కిందికే చేర్చింది. నిర్వహణ మొత్తాన్నీ ప్రైవేటు కంపెనీలకే ఇచ్చేసింది. కాగా పంట నష్టం జరిగిన వేరుశనగ, మరికొన్ని పంటలు వాతావరణ బీమా కిందనే నోటిఫై చేశారు. ఇప్పటి వరకు సదరు బీమా అధికారికంగా అమల్లోకి రాలేదు. రైతుల పరిస్థితి అగమ్యగోచరంలో పడింది.
2015 నాటి స్కేలు
విపత్తులతో పంటలు నష్టపోయిన రైతులకు ఏ సీజన్‌లో నష్టానికి ఆ సీజన్‌లోనే పరిహారం అంటున్న ప్రభుత్వం కొంత మందికి కొద్ది పాటి మొత్తంలో పెట్టుబడి రాయితీ ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఇచ్చే పరిహారం చాలా తక్కువ. ఎప్పుడో 2015 నాటి నిబంధనల మేరకు చెల్లిస్తోంది. వరి, వేరుశనగ, పత్తి ఎకరాకు గరిష్టంగా రూ.ఆరువేలిస్తోంది. రైతుకు పెట్టుబడి అంతకంటే కొన్ని రెట్లు ఖర్చవుతోంది. మొక్కజొన్నకు ఐదు వేలు, పప్పుధాన్యాలకు 4 వేలు, ఆముదాలకు 2,700 ఇస్తోంది. ఇవే పంటలకు కేంద్రం ఎన్‌డిఆర్‌ఫ్ నిబంధనల మేరకు వర్షాధారమైతే 2,720, ఇరిగేటెడ్ అయితే 5,400 ఇస్తోంది. విపత్తు మండలాలను ప్రకటించి కేంద్రాన్ని సాయం అడిగితే, కేంద్ర బృందాలు పర్యటించి సిఫారసు చేస్తేనే ఆ మొత్తమైనా వస్తుంది. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం భరించాలి.
భారీ నష్టం
ప్రాథమిక అంచనాల మేరకు అన్ని పంటలూ కలుపుకొని పది లక్షల ఎకరాలకుపైనే నష్టం జరిగింది. అక్టోబర్‌లో వర్షాభావం తీవ్రమైంది. చాలా చోట్ల వర్షం లేదు. 18 జిల్లాలు, 400 పైగా మండలాల్లో తక్కువ వర్షం ఉంది. 15-20 రోజులుగా చినుకు పడని మండలాలు అత్యధికంగా ఉన్నాయి. కాల్వలకు నీరందక, కరెంట్ కోతల వలన పంటలు ఎండుతున్నాయి. వేరుశనగ ఆరున్నర లక్షల ఎకరాల్లో సాగుకాగా అంతా పోయిందంటున్నారు. మొక్కజొన్న, పత్తి, ఆముదాలు, పప్పుధాన్యాలు, వరి, ఇతర పంటలకూ నష్టం వాటిల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్‌లో 62 లక్షల ఎకరాల్లో సాగైతే పది లక్షల ఎకరాల్లో పంటలు ఇప్పటికే తుడిచిపెట్టుకుపోయాయని, మరో 5-10 లక్షల ఎకరాల్లో దిగుబడి సగానికి సగం దిగుబడి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. పరిస్థితి ఇంత దయనీయంగా ఉండగా బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ రైతులకు ఏ మాత్రం ఉపశమనం కల్పించేవిగా లేవు. ప్రత్యేకంగా ప్రభుత్వం పరిహారం నిర్ణయించి ఇస్తేనే కొంచెమైనా ఆసరా కల్పించినట్లవుతుందన్న డిమాండ్ రైతుల్లో వ్యక్తమవుతోంది.