మాండూస్ తుపాను బాధిత రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం

అనకాపల్లి : మాండూస్ తుపాన్‌తో పంట నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు పంట పరిహారం చెల్లించాలని, రైతుల అప్పులను ప్రభుత్వం మాఫీ చేయాలని సిపిఎం అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.
సోమవారం సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం పత్రికా ప్రకటన విడుదల చేశారు. గత మూడ్రోజులుగా జిల్లాలో కురిసిన వర్షాలకు 12 మండలాల పరిధిలో 74 గ్రామాల్లో సుమారు 947 ఎకరాల కోసిన వరిచేను నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ అంచన వేసిందన్నారు. ప్రాథమిక అంచనాకుమించి పంట నష్టం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. క్షేత్రస్థాయిలో నీట మునిగిన పంటను గుర్తించి, పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరారు. వర్షాలకు పంట దెబ్బతినడం వల్ల పెట్టుబడులకు కూడా పంటరాకపోవడంతో రైతులు అప్పులపాలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్.రాయవరం మండలం తిమ్మాపురంలో తుమ్మి శంకరరావు అనే కౌలు రైతు సుమారు రూ.80 వేలు పెట్టుబడి పెట్టి 2 ఎకరాల్లో వరిపంట వేశారనీ, ఆ వరిపంటను కోసి కుప్పలు వేసేలోగా మాండూస్ తుపాన్ రావడంతో ఆ పంట అంతా తడిసిముద్దయిపోయిందని తీవ్రనష్టంతో ఆ రైతు కన్నీటిపర్యంతమయ్యాడని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సాంకేతిక అంశాలను చూడకుండా విధిగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలుచేసి ప్రకటిత మద్దతు ధరను ప్రభుత్వం చెల్లించాలన్నారు. ఏ దశలో ధాన్యం పంట దిబ్బతిన్నా రైతులకు ఎకరా వరికి రూ.30 వేలు నష్టపరిహారం చెల్లించాలని, వాస్తవ కౌలు రైతులను గుర్తించి పంట నష్ట పరిహారం వారికి కూడా చెల్లించాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నదన్నారు. ఏ విపత్తు వచ్చినా ముందుగా నష్టపోయేది రైతేననీ, ఈ తుపాను వల్ల పంట నష్ట తీవ్రతను పరిగణనలోకి తీసుకోకుండా పంట నీటమునడం, తడిచిపోవడాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పారు. పంటకు నష్టం జరిగి ఈ క్రాప్‌లో నమోదుకాని రైతులకు కూడా పరిహారం అందించాలన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో సాంకేతిక అంశాల జోలికిపోకుండా, మానవతా దృక్పథంతో రైతులకు పూర్తి నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం డిమాండ్ చేస్తున్నదని ప్రకటనలో వివరించారు.