Jun 19,2022 12:49

ప్రజాశక్తి - ఆత్మకూరు(అనంతపురం) : ఖరీఫ్‌లో అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు అమలు చేసిన పంటల బీమాలో పేద రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని సిపిఎం నాయకులు విమర్శించారు. ఆదివారం ఆత్మకూరు తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్పందనలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్‌, మండల కార్యదర్శి శివశంకర్‌ సింగపల్లితాండ, పంపనూరు, ఆత్మకూరు, పంపనూరు త్ణాడ గ్రామాల రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాంభూపాల్‌ మాట్లాడుతూ గత నవంబరు, డిసెంబరు నెలల్లో సిపిఎం చేసిన రైతు రక్షణ పాదయాత్ర, తరువాత చేసిన ఆందోళనల ఫలితంగా పంటలబీమా వచ్చిందన్నారు. అయితే జిల్లాలో ప్రధాన పంటైన వేరుశనగకు అతి తక్కువ పరిహారం వచ్చిందన్నారు. పంట నమోదు చేసుకున్న అర్హులైన రైతులకు కూడా పరిహారం సక్రమంగా రాలేదన్నారు. సింగపల్లితాండలో చంద్ర నాయక్‌ మూడు ఎకరాల్లో కంది, ఆరు ఎకరాల్లో వేరుశనగ పంటవేసి నమోదు చేసుకున్న పరిహారం రాలేదన్నారు. పంపనూరులో ముక్క పోతన్న ఐదు ఎకరాల్లో కంది, మూడు ఎకరాల్లో వేరుశనగ వేశాడని ఆయనకు పరిహారం రాలేదని తెలిపారు. పంపనూరు తాండాలో గోపాల్‌ నాయక్‌ పేరు జాబితాలో వున్నప్పటికీ డబ్బులు రాలేదన్నారు. 10ఎకరాల 14 సెంట్లు వుందని ఫెండింగ్‌ లో పెట్టారాని నాయకులు తెలిపారు. ప్రతి గ్రామంలో ఇలాంటి సంఘటనలు వందల్లో వున్నాయని వీటిని పరిష్కరించి అర్హులందరికీ పరిహారం ఇవ్వాలని శనివారం జెడి ఆఫీసు వద్ద ఎ.పి.రైతు సంఘం చేసిన ఆందోళన ఫలితంగా నేటి నుండి మూడు రోజులు తహశీల్దార్‌ ఆఫీసుల వద్ద ప్రత్యేక స్పందన జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు అర్జీలు ఇవ్వాలని, ప్రభుత్వం వీటన్నింటినీ పరిశీలించి న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేశారు.