ఒంటరిగా కాదు
నలుగురూ నడిచే రహదారిపైకెళ్ళగానే
తమలో తామేదో వెకిలినవ్వులతో ఎదురవుతూ
నాలో నేను చిత్రించుకున్న ఊహాసౌధాలన్నీ
ఒక్కొక్కటిగా కూలుతున్న దృశ్యాలు
ఇంతకాలమూ
నా చుట్టూ బూతద్దాలే ఉన్నాయేమో
ఒక్కదానిలోనూ నేనెలా కనిపిస్తున్నానో
నాకేమాత్రం నిజం తెలియనివ్వలేదని
గుసగుసలాడుకుంటూ నిజ దర్పణంలో
శకలాలు శకలాలుగా కూలుతున్న దృశ్యాలు
అమాయకత్వం కాకపోతే
నీటిమట్టంలాగానే
నీటి అడుగునా ఒకేలా ఉండదు కదా
ఆంతరంగికులెవరో
అట్టడుగున ఎత్తుపల్లాల్ని చేయి పట్టి చూపగానే
అప్పుడే నడక నేర్చుకుంటున్న పసివాడి పాదాల్లా
తడబడుతూ కూలుతున్న దృశ్యాలు
ఆ మైదానంలోకి చేరగానే చిరు జల్లులేవో
కుంభవృష్టులతో జత కట్టినట్లున్నాయి
ప్రవహించి ప్రవహించి
ద్ణుఖం ప్రవాహమై పరుగులిడుతోంది
ఆకాశంలోని నీళ్ళన్నీ పిండేసాక
కూలుతున్న దృశ్యాలు కనబడవు
నేలను ముద్దాడుతున్న ఆకాశం సిగలో
చిత్రితమైన సౌందర్యాత్మక దృశ్యంలో
ఒక ముత్యమేదో మెరుస్తోంది !
- దార్ల వెంకటేశ్వరరావు,
91826 85231










