
అమరావతి : ఎండ ఉక్కపోతతో వేడెక్కిన తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల మీదుగా నైరుతి రుతుపవనాలు ప్రయాణిస్తున్నాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మన్యం జిల్లా కొమరాడలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది అన్నారు.
పలుచోట్ల పిడుగులు పడే అవకాశం : ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పిడుగులు పడనున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సోషల్ మీడియా వేదికగా పలు సూచనలు చేశారు. పిడుగుల పడే జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద ఉండకూడదని సూచించారు. అత్యవసరమైతేనే తప్ప బయటికి రావద్దని హెచ్చరించారు.
పలుచోట్ల వానలు.. ఈదురుగాలులు... విద్యుత్ అంతరాయం
ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో సోమవారం ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులతో వాన కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉపశమనాన్ని పొందారు. రాజమండ్రిలో సోమవారం సాయంత్రం వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండతీవ్రత ఉంటే.. సాయంత్రం ఒక్కసారిగా వాన కురవడంతో అక్కడి ప్రజలంతా సేదదీరారు. నిడదవోలులో సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి గంట పాటు భారీ వర్షం కురిసింది. మరికొన్ని జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఈదురు గాలులతో కూడిన భారీ వాన పడింది. అక్కడక్కడా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
తెలంగాణలో వచ్చే 5 రోజులు వర్షాలు : ఐఎండీ
తెలంగాణలోనూ ... వచ్చే ఐదురోజులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మంగళవారం పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, జనగామతో పాటూ మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయని చెప్పారు.