
న్యూఢిల్లీ : సెప్టెంబరులో నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకొని వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.
ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ .... గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా తక్కువ వానలు ఆగస్టులో కురిశాయని అన్నారు. అయితే సెప్టెంబరులో మాత్రం నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకుని వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. జులైలో అధిక వర్షాలు పడినప్పటికీ తర్వాత ఆగస్టులో చాలావరకు రుతుపవనాలు మొహం చాటేశాయని, నెలలో 20 రోజులపాటు ఎక్కడా చినుకు కూడా పడలేదని అన్నారు. ఈ వారాంతంలోనే దక్షిణాదిలో, మధ్య భారతంలో వానలు కురుస్తాయని చెప్పారు. సెప్టెంబరు నెలకు దీర్ఘకాల సగటు వర్షపాతం 167.9 మి.మీ. కాగా దానిలో 9 శాతం అటూఇటూగా నమోదవుతుందని చెప్పారు. ఒకవేళ ఎక్కువగా వానలు కురిసినా జూన్-సెప్టెంబరు వానాకాలపు సగటు వర్షపాతం మాత్రం సాధారణం కంటే తక్కువగానే ఉండవచ్చని అంచనా వేశారు. ఆగస్టులో వానలు సరిగ్గా కురవకపోవడానికి ఎల్‌నినో పరిస్థితులు కారణం అని అన్నారు. అరేబియా మహాసముద్రం, బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం వల్ల ఇప్పుడు ఎల్‌నినో సానుకూలంగా మారడం మొదలైందని... దీంతోపాటు తూర్పుదిశగా మేఘాల పయనం, ఉష్ణమండల ప్రాంతాల్లో వర్షపాతం వంటివీ రుతుపవనాల పునరుద్ధరణకు అనుకూలంగా మారుతున్నాయని చెప్పారు. దేశంలో అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు.