ప్రజాశక్తి - పిఎం.పాలెం (విశాఖపట్నం) :విశాఖ పిఎం పాలెం సమీపంలోని ఎసిఎ-విడిసిఎ క్రికెట్ స్టేడియంలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఎపిఎల్) సీజన్ - 2 మ్యాచ్‌లు ఉత్సాహంగా సాగుతున్నాయి. శుక్రవారం వైజాగ్ వారియర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కోస్టల్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం.. ఈ మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. తొలుత టాస్ గెలిచి కోస్టల్ రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కి దిగిన వైజాగ్ వారియర్స్ బ్యాట్స్‌మెన్‌లు 8 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 80 పరుగులు సాధించారు. ఓపెనర్‌గా మైదానంలోకి దిగిన కెప్టెన్ అశ్విన్ హెబ్బర్ 26 బంతుల్లో 3 సిక్స్‌లు, 3 ఫోర్లుతో 51 పరుగులు చేసి రాణించారు. ఈ క్రమంలో వర్షం కురిసింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం.. ఆరు ఓవర్లలో 65 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. కోస్టల్ రైడర్స్ 4.5 ఓవర్లకే ఐదు వికెట్లు కోల్పోయి ఆ లక్ష్యాన్ని అందుకుంది. ఆ జట్టు కెప్టెన్ ఎస్‌కె రషీద్ కేవలం ఆరు పరుగులకే అవుటై నిరుత్సాహపరిచారు. మిడిల్ ఆర్డర్‌లో దిగిన లేఖాజ్ రెడ్డి 10 బంతుల్లో 3 సిక్స్‌లు, 2 ఫోర్లుతో 30 పరుగులు చేసి నాట్ అవుట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. అత్యధిక పరుగులు చేసిన వైజాగ్ వారియర్స్ జట్టు కెప్టెన్ అశ్విన్ హెబ్బర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.










