- ఎపిఎల్ సీజన్ 2లో మూడో విజయం
ప్రజాశక్తి - పిఎం.పాలెం (విశాఖపట్నం) : ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఎపిఎల్) సీజన్ - 2లో కోస్టర్ రైడర్స్ వరుస విజయాలతో అదరగొడుతోంది. విశాఖలోని ఎసిఎ-విడిసిఎ మైదానంలో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో ఆ జట్టు గోదావరి టైటాన్స్‌పై 35 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన గోదావరి టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకుని బరిలోకి దిగింది. బ్యాటింగ్ తీసుకున్న కోస్టల్ రైడర్స్ జట్టు బ్యాట్స్‌మెన్‌లు 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 173 పరుగులు సాధించారు. ఓపెనర్ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగిన ఇ.ధరణి కుమార్ 32 బంతుల్లో 3 సిక్స్‌లు, 8 ఫోర్లుతో 59 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఎం.హర్షవర్థన్ 22 బంతుల్లో 35 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గోదావరి టైటాన్స్ బ్యాట్స్‌మెన్‌లు 18.1 ఓవర్లలో 138 పరుగులు మత్రమే చేసి ఆలౌటయ్యారు. ఆ జట్టులో మూడో స్థానంలో దిగిన ఎం.హేమంత్ రెడ్డి మాత్రమే 4 సిక్స్‌లు, 5 ఫోర్లుతో 49 బంతుల్లో 58 పరుగులు చేశారు. మిగతా జట్టు సభ్యులు అంతగా రాణించలేకపోయారు. తాజా గెలుపుతో కోస్టల్ రైడర్స్ జట్టు తన విజయాల సంఖ్యను మూడుకు పెంచుకుంది.










