Sep 13,2022 09:01
  • కేంద్ర ప్రభుత్వ నిర్వాకం
  • ప్రభుత్వ రంగ సంస్థల సర్వే వెల్లడి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఐదు సంవత్సరాల కాలంలో 64 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సిపిఎస్‌ఇ)ను మోడీ సర్కారు మూసివేసింది. 2016-17 నుండి 2020-21 సంవత్సరాల మధ్య ఈ మూసివేత ప్రక్రియ కొనసాగింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యాన నడిచే పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రభుత్వ రంగ సంస్థల సర్వే పేరిట ఒక నివేదికను విడుదల చేసింది. 2016-17 సంవత్సరంలో రెండు సంస్థలను మూసివేసిన ప్రభుత్వం ఆ తరువాత ప్రతి ఏడాదీ ఈ సంఖ్యనుపెంచుకుంటూ వచ్చింది. 2020-21 సంవత్సరంలో అత్యధికంగా 26 సంస్థలను కేంద్ర ప్రభుత్వం మూసివేసింది.
 

పెరుగుతున్న లాభాలు...
అదే సమయంలో మరో 177 సంస్థలు నికర లాభాన్ని ఆర్జించినట్లు ఈ నివేదిక పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం నుండి ఏ మాత్ర సహకారం లేకపోయినా ఈ సంస్థలు లాభాల బాట నడవడం విశేషం. 2016-17లో రూ.1.25 లక్షల కోట్ల రూపాయలు ఆపరేటింగ్‌ సిపిఎస్‌ఇల నికర లాభాలుగా ఉండగా, 2020-21 నాటికి రూ.1.58 లక్షల కోట్లకు ఈ మొత్తంపెరిగింది. అన్ని సిపిఎస్‌ఇల నికర విలువ 2020 మార్చి 31 నాటికి రూ.12.47 లక్షల కోట్ల రూపాయల నుంచి 2021 మార్చి 31 నాటికి రూ.13.62 లక్షల కోట్లకు పెరిగింది.
 

నష్టాల్లోంచి లాభాల్లోకి
నష్టాల్లో ఉన్న 19 సిపిఎస్‌ఇలు లాభాల బాట పట్టాయి. ఈ 19 సిపిఎస్‌ఇల్లో మూడు సంస్థలు రూ.200 కోట్ల కంటే ఎక్కువ లాభాన్ని పొందాయి. వీటిలో ఒకటి 100 కోట్ల రూపాయలకు పైగా లాభాన్ని ఆర్జించింది.
 

కేంద్ర ఖజానాకు ఊతం
వివిధ రకాల పన్నులు, సుంకాల రూపంలో ఈ సంస్థలు కేంద్ర ఖజానాకు పెద్ద మొత్తంలో నిధులను సమకూరుస్తున్నాయి. 2019-20లో 3.79 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న ఈ మొత్తం 2020-21లో రూ.4.96 లక్షల కోట్లకు పెరిగింది. కరోనా విజృంభించిన కాలంలోనూ వీటినుండి ఖజానాకు చేరుతున్న మొత్తం తగ్గలేదు. అదే సమయంలో ఈ సంస్థలు పెట్టుబడులను కూడా పెంచుకున్నాయి. 2019-20లో రూ.21.28 లక్షల కోట్ల నుంచి 2020-21లో రూ.21.67 లక్షల కోట్లకు సిపిఎస్‌ఇల్లో ఆర్థిక పెట్టుబడులు పెరిగాయి. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కాగేట్‌ గ్రూప్‌లో ఆర్థిక పెట్టుబడుల్లో అత్యధిక పెరుగుదల కనిపించింది. తరువాత పవర్‌ జనరేషన్‌ 15.05 శాతం పెట్టుబడులు పెరిగాయి.
 

తగ్గుతున్న నష్టాలు
మరికొన్ని సిపిఎస్‌ఇలు నష్టాలను గణనీయంగా తగ్గించుకుంటున్నాయి. 2019-20లో రూ.44,277 కోట్ల నష్టాలు మూటకట్టుకున్న సిపిఎస్‌ఇలు, 2020-21 నాటికి రూ.31,219 కోట్లకు తగ్గించగలిగాయి. ఇలా నష్టాలు తగ్గించుకున్న సంస్థల్లో భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌, రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌, (మంగళూరు రిఫైనరీ, పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌, మహానగర్‌ టెలిఫోన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ ఉన్నాయి.

11