May 08,2023 06:47

క్రమక్రమంగా ఆక్రమిస్తోంది చీకటి
ఒక పథకం ప్రకారమే బయల్దేరిన చీకటి
దేశమంతా విస్తరిస్తోంది!
మన అస్తిత్వాల మీద
చారిత్రక మూలాల మీద
నల్ల మబ్బుల్లా కమ్ముకుంటోంది
చీకటిని చింతిస్తూ కూర్చుంటే
దీపం వెలగదని తెలిసే
పద్దెనిమిది వందల మంది యోధులు
నిరసన పత్రాలను వెలుగు బాణాలుగా
సంధించి వదిలారు
అయినా ఉప్పొంగిన కెరటాల్లా
దూసుకొస్తున్న చీకటి
మన జాననేత్రాలను పెకలించి
అజానంలోకి విసిరేసే పెనుచీకటి
దేశమంతా చీకట్లో తచ్చాడే రోజు
ఎంతో దూరంలో లేదనిపిస్తోంది

చారిత్రక సత్య పాఠాలను వదిలేసి
సరికొత్తగా చీకటి పాఠాలను వల్లె వేసే
అంధ ప్రపంచమొకటి పొడుచుకొస్తోంది
ఈ చీకటిని ఛేదించాలంటే
పద్దెనిమిది మంది యోధులతోపాటు
ప్రతి పౌరుడూ ఒక కాంతి ఖడ్గం కావాల్సిందే
చీకటిని కడిగేసే వెలుగు కాగడాలు ధరించి
నింగీ నేలంతా కదం తొక్కాల్సిందే
దేశం దారితప్పి చీకట్లో కలవకముందే
కళ్లు తెరిచి కాంతికిరణాలమవ్వాల్సిందే!

- చిత్తలూరి