Jul 17,2023 07:29

తనను కలవాలని
తన ఆలింగనంలో కరగాలని
ఎప్పటినుంచో లోలోపలి కోరిక
బాధ్యతల కొక్కేనికి
బతుకు కళేబరాన్ని వేలాడదీసాక
నాలుగ్గోడల బంధనంలో ఊపిరాడక
ఎప్పటికప్పుడు అంధకారపు కారాగారంలో ...

                  ***


ఎంతో కాలం తర్వాత
నీ చెంత చేరుతున్నప్పుడు
అతిథికి స్వాగత గీతం పాడుతున్నట్లు
అంత దూరాన్నుంచే ఒకటే హౌరు
అంతెత్తున ఎగసిపడే అలలతో
ఒడలు తడిసి తన్మయమైనా ...

            ***

ముసలి మొగుళ్ళ కౌగిళ్లలో
బాల్య వివాహపు ఉరికంబాల్లో
సతీ సహగమనం జ్వాలల్లో బాధితులు
నిర్భయ నుంచి ఆసిఫాలు
వాకపల్లి ఆదివాసీల
అత్యాచారాల దు:ఖాల గుణకారాల
కన్నీటి జీరలు మనసుని మెలిపెడ్తుంటే ...

                 ***

ఆనాటి అందాల ప్రతిమలు ఆట బొమ్మలనుంచి
పిట్టలు చేపలు సరుకులు వస్తువులు వరకు మారిన
మాయాప్రపంచంలో
తరతరాలుగా చెక్కిళ్లపై జారిన
ఉప్పని కన్నీటి ప్రవాహాల హౌరు

               ***

ఇంటికి వచ్చినా చెవుల్లో మారుమోగే
ఇంతుల నిరంతర ద్ణుఖాల వెక్కిళ్లు !
 

- మందరపు హైమవతి