Apr 10,2023 07:59

డబ్బు మనిషికి స్వార్థాన్ని నేర్పినట్లే
భూమికి దాహాన్ని నేర్పుతుంది ఎండ
ఎండిన కాలువలన్నీ దాహంతో
నీటికోసం అలమటిస్తున్నాయి
దొంగ మబ్బులు బెదిరిపోయి
దూరంగా పరుగులు తీస్తూ
తూర్పు దిక్కుని వదిలి పారిపోయి
పడమటి కొండల వెనక్కి దాక్కుంటున్నాయి

గొప్పగా దాహం పెరుగుతూనే ఉంది
నేల పగుళ్ళు తెరుచుకుంటూనే ఉన్నాయి
ప్రకృతి గమనం ఎండకు మందగిస్తుంది
ఆకునైనా పలకరించలేని అసహాయంతో
గాలి కదలటం చాతకాక స్తంభిస్తుంది

ఎండకు భూమి నోరు విచ్చుకుంది
ఒక్కటంటే ఒక్కటీ చినుకు పడిందా
నిస్సారమై పోయిన భూమికి
మళ్ళీ ప్రాణం పోస్తుంది
భూమి రాబోయే నీటిని తాగి తాగి
కడుపు పండించుకుని
మరో ఏడాదికి మళ్ళీ పంటని ఇస్తుంది

మనిషైనా అంతే కదా
నిస్సహాయంగా నిర్జీవంగా మారి
పలకరించే దిక్కులేక ప్రేమరాహిత్యంతో
నెర్రెలు విచ్చిన మనసుపై
ఒక్క ఆత్మీయ బిందువును చిలకరించి చూడు
తిరిగి పునర్జీవితాన్ని పొంది
స్వప్నాలు చిగుర్లు వేస్తాయి !
 

- శీలా సుభద్రాదేవి
81068 83099